కరీంనగర్‌లోని నిరుపేదలకు గుడ్ న్యూస్.. డబుల్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్

by Sridhar Babu |
కరీంనగర్‌లోని నిరుపేదలకు గుడ్ న్యూస్.. డబుల్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్
X

దిశ, కరీంనగర్ సిటీ : జిల్లాలోని ప్రతీ నిరుపేదకు గూడు కల్పించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఎట్టకేలకు నెరవేరబోతుంది. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల సాకారం కాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉండగా వాటిని పేదలకు అందజేసేందుకు అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ముందుగా కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అర్హులకు డబుల్ ఇల్లు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 19న బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా అందజేయనున్నారు.

అనంతరం ఇతర గ్రామాల్లో కూడా వెంట వెంటనే లబ్ధిదారులకు అప్పగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తడంతో పనులు మందకొడిగా సాగుతుండగా, త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎలగందుల, ఖాజిపూర్ గ్రామాల్లో కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కావటంతో అక్కడ కూడా పంపిణీకి సమాయత్తమవుతున్నారు.కొవిడ్ కారణంగా ఇండ్ల నిర్మాణం పట్టాల పంపిణీ కార్యక్రమంలో కొంత జాప్యం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి గంగుల చొరవతో ఇటీవలే వాటి నిర్మాణాల్లో వేగం పెరిగింది.

సెగ్మెంట్‌లో మొదటి విడతగా 1400 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకుని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంతో, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టనున్నారు. కమాన్ పూర్ గ్రామానికి మొదటి విడతలో 67 ఇండ్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో డ్యామ్ ముంపు గ్రామమైన రాములపల్లికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతావి కమాన్ పూర్ గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయించనున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీలో ఎటువంటి పైరవీలకు తావు లేకుండా, అర్హులైన నిరుపేదలకు అందించాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story