పగ్గాల్లేని పసిడి

by Harish |   ( Updated:2020-05-20 07:28:24.0  )
పగ్గాల్లేని పసిడి
X

దిశ, సెంట్రల్ డెస్క్: రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో బంగారం ధర పరుగుల పెట్టేలా చేస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంగా ఉండేందుకు బంగారానికి మించిన పెట్టుబడి లేదు. అందుకే మదుపరులు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయంగా చూస్తే ఈ పరిణామాలతో పాటు రూపాయి బలహీనపడుతుండటంతో బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు రక్షణాత్మక ధోరణిలో బంగారంపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కరోనా నుంచి కోలుకుని ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకునే సమయానికి బంగారం 1,900 డాలర్లను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. వెండి ధరల్లో ఊగిసలాట ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత వెండి ఔన్స్ 15 డాలర్లకు అటుఇటుగా ఉంది.

దేశీయంగా బంగారం ధరలు బుధవారం ఎమ్‌సీఎక్స్ మార్కెట్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.299 ఎగిసి 10 గ్రాములకు రూ.47,349 పలికింది. గత ఆరు సెషన్‌లలో ఐదుసార్లు బంగారం ధర పెరిగింది. గత వారం బంగారం ధరలు రూ.47,980 రికార్డ్ ధరకు చేరుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములపై రూ.590 తగ్గి రూ.48,400 ధరకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.45,360గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా కిలో ఏకంగా రూ.1340 పెరిగి రూ.49,390 ధరకు చేరుకుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కిలో రూ.50,000 దాటడానికి ఎక్కువ రోజులు పట్టదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed