బంగారానికి డిమాండ్ ఉండదట!

by Harish |
బంగారానికి డిమాండ్ ఉండదట!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిన కొవిడ్-19 వల్ల దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గిపోనుందని, సుమారు 30 శాతం తగ్గొచ్చని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) అభిప్రాయపడింది. 2019లో 690 టన్నులుగా ఉన్న బంగారం డిమాండ్ 2020లో 30 శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయని ఐసీసీ చెబుతోంది. కరోనా విజృంభనతో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుతోందని, ఇది మరింత కాలం పొడిగించే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో జెమ్స్ అండ్ జ్యువెలర్స్, లైఫ్‌స్టైల్ దుకాణాల స్టోర్లు దేశవ్యాప్తంగా మూసివేయబడ్డాయి.

ఈ పరిశ్రమ దేశ జీడీపీలో 7 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో దాదాపు 50 లక్షలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కరోనా వ్యాప్తి వల్ల అన్ని రకాల శుభకార్యాలు రద్దయ్యాయి. శుభకార్యాలు లేక బంగారం కొనుగోళ్లు పూర్తీగా నిలిచిపోయాయి. జ్యువెలరీ షాపులన్నీ మూతపడ్డాయి.

దేశంలో అన్ని రకాలుగా పరిశీలిస్తే సగటున బంగారం డిమాండ్ ఏడాదికి 850 టన్నులుగా ఉంటుంది. 2020 ఏడాదిలో 700 నుంచి 800 టన్నుల పరిధిలో ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ కరోనా వంటి విపత్తు ఎదురవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో బంగారానికి డిమాండ్ మరింత క్షీణించింది. కరోనా విపత్తు ప్రభావం కారణంగా బంగారం డిమాండ్‌తో పాటు ఈ రంగంలోని ఉద్యోగాలు, ఆదాయాలపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుందని ఐసీసీ భావిస్తోంది.

ఈ పరిస్థితులతో జ్యువెలరీ పరిశ్రమల్లో కూలీ చేసుకునే రోజూవారి కార్మికులకు, ఇతర ఉద్యోగులకు పని దొరక్కుండా పోయింది. అంతేకాకుండా అడ్వాన్స్ ట్యాక్స్, బంగారంపై తీసుకున్న రుణాల చెల్లింపుకు కాల తీరిపోవడం, వడ్డీ చెల్లింపులు వంటి వాటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకోసం అన్ని రకాల చెల్లింపులకు కనీసం ఆరు నెలల గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని ఐసీసీ సూచిస్తోంది. అలాగే, బంగారం లోన్లపై వడ్డీరేట్లు తగ్గించాలని, కనీసం 50 శాతం తగ్గించేలా చూడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.

Tags : gems and jewellery, Gold demand, coronavirus, Indian Chamber of Commerce, precious metals

Advertisement

Next Story