ఆఖరి నిమిషంలో గోల్స్.. మ్యాచ్ డ్రా

by Shiva |
ఆఖరి నిమిషంలో గోల్స్.. మ్యాచ్ డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా సోమవారం జీఎంసీ స్టేడియంలో ముంబయి సిటీ, గోవా ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ మొదటి నుంచి ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివర్లో ఆసక్తికరంగా ముగియడం విశేషం. టాస్ గెలిచి ముంబయి సిటీ ఎఫ్‌సీ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకుంది. 20వ నిమిషంలో హుగో బోమస్ గోల్ చేసి ముంబయి సిటీకి 1-0 ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు. 26వ నిమిషంలో ఆడమ్ లె ఫాంద్రే గోల్ కొట్టి ముంబయి సిటీ ఆధిక్యాన్ని 2-0కి తీసుకెళ్లాడు. గోవా క్లబ్ గోల్స్ చేయడానికి ప్రయత్నించి చివరకు 45వ నిమిషంలో సఫలమైంది.

గ్లెన్ మార్టిన్స్ అద్బుతమైన గోల్ చేసి ముంబయి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. తొలి అర్దభాగంలో ముంబయిదే పైచేయిగా మారింది. ఇక అర్దభాగం మొదలైన కొద్ది సేపటికే ఇగొర్ అంగులో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. 51వ నిమిషంలో లభించిన ఈ గోల్ ద్వారా ఇరు జట్ల స్కోర్లు 2-2గా నిలిచాయి. రెండో అర్దభాగంగలో ఇరు జట్లు పోటాపోటీగా ఆడాయి. మ్యాచ్ ముగుస్తుంది అనగా 90వ నిమిషంలో రోలింగ్ బోర్గెస్ గోల్ చేసి ముంబయికి 3-2 ఆధిక్యత తెచ్చిపెట్టాడు. అయితే రిఫరీ మరో 6 నిమిషాల ఇంజ్యూరీ టైమ్ కలిపాడు. 90+6వ నిమిషంలో గోవా ఆటగాడు ఇషాన్ పండిత గోల్ చేసి ఓడిపోతుందనుకున్న గోవాను రక్షించాడు. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 3-3తో సమానంగా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఎడ్యూ బెడియాకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, రోలింగ్ బోర్గెస్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Advertisement

Next Story