జీఓ నెంబర్ 3 ను కొనసాగించాలి: ఎంసీపీఐ(యూ)

by Shyam |
జీఓ నెంబర్ 3 ను కొనసాగించాలి: ఎంసీపీఐ(యూ)
X

దిశ, హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయుల నియామకాల జీఓ నెంబర్ 3ను కొనసాగించాలని, సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలించాలని ఎంసీపీఐ(యూ) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల వద్దనే బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ హైదరాబాద్ మియాపూర్ లోని తన నివాసంలో, మియాపూర్ సమీపంలోని స్టాలిన్ నగర్ లో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ లు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నాయకులు వారి ఇండ్ల నుంచే నిరసన తెలిపారు. తాండ్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధలను పాటిస్తూనే నిరసన తెలియజేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయుల కోసం గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ను ప్రస్తుతం సుప్రీం కోర్టు కొట్టివేయడం బాధాకరం అన్నారు. జీవో నెంబర్ 3ను కొట్టివేయడం బీజేపీ ప్రభుత్వం గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం అన్నారు. ఆదివాసీ గిరిజనుల విద్య, వైద్య అవకాశాల కోసం మద్దికాయల ఓంకార్ చట్ట సభలలో పోరాటం చేయడంతో రాజ్యాంగంలోని 1/70 చట్టం, రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, 6 అమలుకు నోచుకున్నాయని అన్నారు. ఆదివాసుల హక్కుల రక్షణకై తక్షణం జీవో నెంబర్ 3 కొట్టివేతపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష పోరాటాలకు పూనుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ దిప్తీ శ్రీనగర్ లో పార్టీ నాయకురాలు కె. సుకన్య, పల్లె మురళి, టి. కళావతి తదితరులతో పాటు ఇతర జిల్లాల నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని తాండ్ర తెలిపారు.

Tag:Corona Effect, Supreme Court Dismissed GO No.3, MCPI(U), Thandra Kumar

Advertisement

Next Story

Most Viewed