‘గ్లోబల్ హార్ట్’ ప్రియాంక

by Shyam |   ( Updated:2020-11-08 03:02:43.0  )
‘గ్లోబల్ హార్ట్’ ప్రియాంక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియాంక చోప్రాను అందరూ ‘గ్లోబల్ స్టార్’ అని పిలుస్తుంటారు. అటు సినిమాలైనా, అమెరికన్ టీవీ షోలైనా, ఈవెంట్‌లైనా, హాలీడేలైనా, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలైనా.. ఇలా అన్నింటికీ హాజరయ్యేందుకు ఆమె ప్రపంచమొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఫర్ఫెక్ట్‌గా చెప్పాలంటే ఆమె ఒకే రోజులో నాలుగైదు టైమ్ జోన్‌లలో వేర్వేరు పనులకు హాజరైన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి గ్లోబల్ స్టార్‌ను ఇప్పుడు గ్లోబల్ హార్ట్ అని పిలవక తప్పని పరిస్థితి. ఆమె చేసే సేవా కార్యక్రమాలను చూసి ఇన్నాళ్లు గోల్డెన్ హార్ట్ అన్నారు, ఇప్పుడు గ్లోబల్ హార్ట్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే..

సాధారణంగా చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో వెయ్యి మంది ఫాలోవర్లు దాటగానే తమను తాము ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మార్చుకుని, డబ్బులు తీసుకుని బ్రాండ్ల గురించి ప్రచారం చేస్తుంటారు. ఎవరన్నా ఏదన్నా సాధిస్తే వారి గురించి కూడా ఫ్రీగా చెప్పడానికి సంకోచిస్తారు. మరి 58.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టా స్టోరీలో దేని గురించైనా పెట్టాలంటే ఎంత చార్జ్ చేయాలి? ఆమె తలచుకుంటే ఒక్క 10 సెకన్ల ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి కోట్లలో డబ్బు సంపాదించగలుగుతుంది. కానీ ఆ స్టోరీ స్పేస్‌ను కూడా మంచి కోసం ఉపయోగిస్తోంది కాబట్టే ఆమెను గ్లోబల్ హార్ట్ అంటున్నారు. ఇంతకీ ఆమె దేని కోసం ఉపయోగిస్తోంది?

సోమవారం నుంచి శనివారం వరకు తనలో స్ఫూర్తినింపిన కొందరు సాధారణ వ్యక్తుల కథలను ఆదివారం నాడు ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టా స్టోరీలుగా పెడుతుంటుంది. కేవలం ఇండియాకు సంబంధించిన కథనాలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేరణ కలిగించే విధంగా ఉండి, మెచ్చుకోదగిన ప్రతి వ్యక్తి, సంస్థ గురించి ఆమె తన స్టోరీల్లో తెలియజేస్తుంది. ఇటీవల అంబులెన్స్‌కు దారి కోసం 2 కి.మీ.లు పరుగెత్తిన పోలీస్ గురించి, అమెరికా పాఠ్యపుస్తకాల్లో పాఠంగా మారిన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి, అలాగే అంతర్జాతీయంగా గుర్తింపు పొందాల్సిన అవసరం ఉన్న చిన్న చిన్న బిజినెస్‌ల గురించి, మహిళా సాధికారతలో భాగంగా అభివృద్ధి చేస్తున్న వినూత్న ఐడియాల గురించి ఆమె తన స్టోరీల్లో పెడతారు. స్టోరీల్లో పెట్టడం గొప్ప విషయమా అనుకోవచ్చు. ప్రియాంక చోప్రా స్టోరీల్లో పెట్టడం వల్ల 58.2 మిలియన్ల మందిలో సగం మందికి తెలిసినా వారి బిజినెస్ పెరుగుతుంది. అందుకే ప్రియాంకది గ్లోబల్ హార్ట్!

Advertisement

Next Story