నకిలీలల మాయగాడికి జైల్లో సర్వసౌఖ్యాలు

by srinivas |
నకిలీలల మాయగాడికి జైల్లో సర్వసౌఖ్యాలు
X

భద్రత కోసం చుట్టూ పోలీసులు.. శిక్షకు బదులుగా రాచమర్యాదలు.. జైలైతేనేం.. విలాసాలకు లోటుండదు… ఆదివారమైతే ఇక పండగే.. జైలులో పొట్టేలు తెగాల్సిందే… ఖైదీలతో సహా సిబ్బందికి కూడా జైలు వంటశాలలోనే పసందైన విందు భోజనం రెడీ.. ఇంతకీ ఈ తతంగమంతా ఎక్కడనుకుంటున్నారా? అనంతపురం జిల్లాలోని గుత్తి సబ్ జైలులో.. జైలులోనే అరకొర సౌకర్యాలుంటాయి. అలాంటిది సబ్ జైలులో అంటే సౌకర్యాల సంగతి ఊహించవచ్చు. అయినప్పటికీ అక్కడి జైలు సిబ్బంది సర్వసౌఖ్యాలు అందజేస్తారని గ్లెన్ బ్రిగ్స్‌ని అడిగితే చెబుతాడు. ఇంతకీ ఈ గ్లెన్ బ్రిగ్స్ ఎవరు? అన్న అనుమానం వచ్చిందా?… అయితే చదవాల్సిందే..

గ్లెన్‌ బ్రిగ్స్‌… ఈ కాలపు చార్లెస్‌ శోభరాజ్‌. పోలీసులంటే లెక్కేలేదు. జైలంటే భయం లేదు. కేసులపై ఆందోళన లేని వ్యక్తి బ్రిగ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల సృష్టికర్త. గుత్తి, గుంతకల్లు, తిరుపతి కేంద్రాలుగా వేల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి దేశవ్యాప్తంగా విక్రయించిన ఘరానా మోసగాడు. పోలీసులతో ఉన్న పరిచయాల నేపథ్యంలో అతని నేరచరిత్ర, విలాసాలు, జైల్లో అందుతున్న రాజభోగాలుపై ఆరాతీసిన అధికారులే అవాక్కవుతున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. బ్రిగ్స్ ఇటీవల అరెస్టై గుత్తి సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. జైలులో ఉన్నాడన్న మాటే కానీ బయటి ప్రపంచంతో నిత్యం టచ్‌లో ఉంటున్నాడు.

గ్లెన్‌ బ్రిగ్స్‌ నేర చరిత్రపై ఆధారాలతో సహా జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పూర్తి నివేదిక పంపారు. దీనిని చూసిన జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్‌ గుత్తి సబ్‌జైలును తనిఖీ చేశారు. బ్రిగ్స్‌తో జైలు సిబ్బందికి ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక గది, ఫ్యాన్, పరుపు తదితర సౌకర్యాలు అందేవని గుర్తించారు. ఫోన్ సౌకర్యానికి లోటులేకుండా చూసేవారని, ఖరీదైన మద్యం, మటన్ బిర్యానీ గదికి సరఫరా చేసేవారని, అతనికి అవసరమైతే రహస్యంగా జైలు నుంచి బయటికి తీసుకువెళ్లి పనులు పూర్తిచేయించుకోనిచ్చేవారని గుర్తించారు. బ్రిగ్స్ ఆదేశిస్తే ఖైదీలకు కూడా బిర్యానీలు అందించే వారని, ఇందుకోసం భారీగా నజరానాలు తీసుకునేవారని ఆయన రూఢీ చేసుకున్నారు. దీంతో ఆయన అక్కడి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సబ్‌జైలులో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. మరికొందరు సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

జైలులో రిమాండ్, శిక్ష పడిన ఖైదీలు గ్లెన్‌ బ్రిగ్స్‌ సాహచర్యంలో అతనికి అభిమానులుగా, అనుచరులుగా మారారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తరువాత అతని నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌లో కీలకంగా వ్యవహరించేవారు. ఖాకీల అండదండలతోనే గ్లెన్‌ బ్రిగ్స్‌ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నట్లు ఆయన గుర్తించారు. దీంతో రెండు దశాబ్దాలుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కరెన్సీ సృష్టించి చెలామణి చేసినట్లుగా భావిస్తున్నారు. 2006, 2007, 2008లలో నకిలీ సర్టిఫికెట్లు తయారీ కేసుల్లో గ్లెన్ బ్రిగ్స్ అరెస్టయ్యాడు. దీంతో అప్పటి జిల్లా ఎస్పీ స్టీఫెన్‌ రవీంద్ర జిల్లా బహిష్కరణ శిక్ష విధించారు. దీంతో తిరుపతికి మకాం మార్చి, సురేష్‌రెడ్డిగా మారి దందా కొనసాగించాడు. అతని పాపం పండడంతో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో జైలుకి వెళ్లడం..అక్కడ సర్వసౌఖ్యాలు పొందడం, బెయిల్‌పై బయటకి రావడం మళ్లీ దందా షురూ చెయ్యడం బ్రిక్స్‌కి సాధారణంగా మారిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed