ఆర్కెస్ట్రాలో వెనిజులా యువతి సంచలనం

by vinod kumar |
ఆర్కెస్ట్రాలో వెనిజులా యువతి సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్ : వెనిజులా‌లోని కరాకస్, యారాకుయ్ నగరానికి చెందిన 24 ఏళ్ల గ్లాస్ మార్కనో.. చిన్నప్పటి నుంచి తనను తాను ఓ సంగీత కళాకారిణిగా ఊహించుకోవడమే కాకుండా, అందుకోసం తీవ్రంగా శ్రమించింది. ఆర్కెస్ట్రాలో నైపుణ్యం సాధించేందుకు పలు కోర్సులు చేసింది. ఆ క్రమంలోనే యువ కళాకారుల కోసం వెనిజులా ప్రభుత్వ సాయంతో నడిచే ప్రఖ్యాత సంస్థ ‘ఎల్ సిస్టెమా’లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. అయితే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో తనకు ‘లా మాస్ట్రా’ గురించి తెలిసింది. మహిళల కోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పోటీ కావడంతో.. అందులో ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలనుకుంది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఆ పోటీలో పాల్గొనాలంటే రూ.13,248/- ($180) ఎంట్రీ ఫీజు చెల్లించాలి. మరి మార్కనో ఎంట్రీ ఫీజు ఎలా చెల్లించింది? అందులో విజేతగా ఎలా నిలిచిందో తెలుసుకుందాం.

కరోనా వల్ల వెనిజులా దేశమే కాదు, మార్కనో కూడా ఎన్నో ఆర్థిక నష్టాలను ఎదుర్కొంది. దీంతో ‘లా మాస్ట్రా’ ఎంట్రీ ఫీజు చెల్లించలేక ఈ సారి ఆశలు వదిలేసుకోవాలన్నా, అందుకు తన మనసు అంగీకరించలేదు. స్నేహితులను, బంధువుల సాయంతో రూ.7 వేలు సమకూరాయి. అదే టైమ్‌లో ఓ మ్యూజిక్ మ్యాగజైన్‌లో తన గురించి స్టోరీ పబ్లిష్ అవడంతో.. ‘లా మాస్ట్రా’ నిర్వాహకులు మార్కనోతో కేవలం ఏడు వేల రూపాయలే కట్టించుకోవడంతో ‘లా మాస్ట్రా’లోకి అడుగుపెట్టింది. అనుకున్నట్లే గతేడాది అక్టోబర్‌లో మార్కనో ‘లా మాస్ట్రా’ పోటీకి అర్హత సాధించగా, కరోనా లాక్‌డౌన్ కారణంగా పోటీలు వాయిదాపడ్డాయి. దాంతో ఆమె తిరిగి తన స్వస్థలమైన యారాకుయ్‌కు వెళ్లిపోయింది. పారిస్‌లో జరిగే ‘లా మాస్ట్రా’ పోటీలకు హాజరయ్యేందుకు, ఓ పండ్ల దుకాణంలో పనిచేసింది. ఇంతలోనే ఆమెకు ‘లా మాస్ట్రా’ పోటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది కానీ, వెనిజులాలో ఇంకా విమాన ప్రయాణాలు మొదలు కాకపోవడంతో మళ్లీ ఆమె ఆశలు ఆవిరయ్యాయి.

ఈ క్రమంలోనే కొవిడ్ కారణంగా వెనిజులాలో చిక్కుకుపోయిన స్పానిష్ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం ఒక విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మార్కనోకు తెలిసింది. అయితే, స్పానిష్ పాస్‌పోర్ట్ ఉన్నవారికే ఈ విమానంలో చోటు ఉన్నప్పటికీ.. లా మాస్ట్రా పోటీ నిర్వాహకులు కరాకస్‌లో ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి మార్కనోకు ఆ విమానంలో చోటు దక్కేలా ఏర్పాట్లు చేయడంతో ఆమె కలలకు మళ్లీ రెక్కలు తొడిగినట్లైంది. మార్కనో అలా వెనెజులా దాటి మొట్టమొదటి సారిగా విమాన ప్రయాణం చేసి పారిస్ వరకు చేరుకుంది. ఆమె ధైర్యంగా స్టేజిపైకి ఎక్కి ఆర్కెస్ట్రా నిర్వహించడమే కాకుండా, విజేతగా నిలిచి పారిస్ ప్రజల అభినందనలు అందుకుంది. ‘24 ఏళ్ల ఈ అమ్మాయిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. వెనెజులా దాటి రాని ఓ అమ్మాయి.. ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం నిజంగా అద్భుతం’ అని లా మాస్ట్రా నిర్వాహకులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

Advertisement

Next Story