ఫ్రీగా ఇస్తే వద్దట.. దాతలే ఇవ్వాలట.. జీహెచ్ఎంసీ వింత వైఖరి

by Anukaran |   ( Updated:2021-05-24 11:19:10.0  )
cemeteries
X

దిశ, తెలంగాణ బ్యూరో : శ్మశాన వాటికలకు కావాల్సిన కట్టెలు తేవడం కోసం జీహెచ్ఎంసీ దాతల కోసం ఎదురుచూస్తోంది. నగరంలో నిత్యం వందల మంది అంతిమ సంస్కారాలు చేస్తున్న పరిస్థితుల్లో కట్టెల కొరత ఏర్పడుతోంది. సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన అటవీశాఖ ఉచితంగా కలపను ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. రవాణా ఖర్చుల బేరీజులు వేస్తున్న బల్దియా దాతల కోసం ఎదురుచూస్తోంది. ఆస్పత్రుల్లో, శ్మశాన వాటికల ముందు క్యూలు కడుతున్న శవాలు కాలాలంటే జీహెచ్ఎంసీకి దాతృత్వం డబ్బులే ఆధారం కానున్నాయి.

శ్మశాన వాటికల్లో తిరుగుతున్న ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సైతం దహన క్రియలకు కట్టెలు సమకూర్చుకునే దిశగా ఆలోచన చేయకపోవడంతో బల్దియా అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. శ్మశాన వాటికల్లో అంతిమ క్రియల కోసం ప్రజలు బారులు కడుతుండగా.. ఇదే అదనుగా నిర్వాహకులు వేల రూపాయలను దోచుకుంటున్నారు.

కొవిడ్ మరణాలతో సాధారణ, ఇతర కారణాలతో మరణించిన వారితో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ఖననం చేసేందుకు స్థల సమస్య ఉండటంతో పాటు దహనం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. దహనం చేసేందుకు కట్టెల కొరత ఉండటంతో శ్మశాన వాటిక వద్ద పదుల సంఖ్యలో దహన క్రియల కోసం వెయిటింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యతగా స్పందించిన అటవీశాఖ వెయ్యి టన్నుల కలపను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 150 టన్నులను కూడా వివిధ జిల్లాలకు సరఫరా చేసింది. ఈ జాబితాలో ఖమ్మం, కాగజ్ నగర్​, మణుగూరు, సత్తుపల్లి, షాద్ నగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీకి ఇచ్చేందుకు మీనాజీపేట, గజ్వేల్ వద్ద గల అటవీ శాఖ కలప కేంద్రాల్లో నిల్వ చేసింది. ఒక్కో టన్ను కలప ప్రస్తుతం టన్నుకు రూ.1,200 వరకూ ఖర్చవుతుండగా.. అటవీ శాఖ పూర్తిగా ఉచితంగా ఇస్తామని హామీనిచ్చింది. ఇతర మున్సిపాలిటీలు ఇప్పటికే తీసుకెళ్లగా రాష్ట్రంలోనే ఎక్కువ దహన క్రియలు చేస్తున్న జీహెచ్ఎంసీ కలప తెచ్చుకునేందుకు ముందుకు రావడం లేదు. హైవే రోడ్లపై సిటీకి దగ్గరలోనే కలప డిపోలున్నప్పటికీ ఖర్చు భారమంటూ జీహెచ్ఎంసీ కలపను తీసుకురావడం లేదు.

కలప ఉచితంగానే ఇస్తున్నప్పటికీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్, కూలీలకు ఖర్చు చేయాల్సి వస్తుందంటూ జీహెచ్ఎంసీ ముందుకు రావడం లేదు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఏఎంఓహెచ్ లను విడివిడిగా సంప్రదించినప్పటికీ స్పందించడం లేదు. దీంతో శ్మశాన వాటికల్లో కలప కొరత కారణంగా దహన క్రియలకు ఆలస్యమవుతోంది.

శ్మశాన వాటికల్లో అధికంగా వసూళ్లపై వచ్చిన ఫిర్యాదులతో ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ జీహెచ్ఎంసీలో పర్యటిస్తున్నారు. నగరంలోని పలు శ్మశాన వాటికలను ఇప్పటికే పర్యటించిన అర్వింద్ కుమార్ కలపను తెప్పించేందుకు దృష్టి సారించడం లేదు. అటవీ శాఖ ప్రకటించి 20 రోజులు దాటినా జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం లేదు. గతేడాది కొవిడ్ సమయంలోనూ జీహెచ్ఎంసీ శ్మశాన వాటికల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామంటూ మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా వైకుంఠధామాలంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. ఇప్పటికీ జీహెచ్ఎంసీ శ్మశాన వాటికల్లో కలప కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వంలోని ఒక శాఖ ప్రజల అవస్థలను గమనించి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ మేనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయమందిస్తే తప్ప జీహెచ్ఎంసీ అటవీ కలపను తెచ్చుకునేలా కనిపించడం లేదు. క్యూలైన్లు కడుతున్న మృతదేహాలను చూసి కూడా అధికారుల వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో ప్రజలు ఆర్థిక భారాన్ని మోయడంతో పాటు శ్మశాన వాటికల ముందు పడిగాపులు కాస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed