మర్కజ్‌కు వెళ్ళినవారెంతమంది?

by Shyam |
మర్కజ్‌కు వెళ్ళినవారెంతమంది?
X

దిశ, న్యూస్ బ్యూరో:

ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్ళినవారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏయే రాష్ట్రం నుంచి ఎంత మంది మర్కజ్‌కు హాజరయ్యారో కేంద్ర హోం మంత్రిత్వశాఖ లెక్కలు తీసింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన సుమారు 1030 మంది హాజరైనట్లు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా రాష్ట్రానికి జిల్లాలవారీగా వివరాలను అందించినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏయే జిల్లా నుంచి ఎంత మంది హాజరయ్యారో లెక్కలు తీసి వారి ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి సమాచార సేకరణ పూర్తవుతుందని రాష్ట్ర అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలోని మూడవ అంతస్తులో ఉన్న పశు సంవర్ధక శాఖకు చెందిన ఒక అధికారి సైతం మర్కజ్‌కు వెళ్ళి వచ్చినట్లు తెలియడంతో ఆయనను క్వారంటైన్‌కు పంపారు. బీఆర్‌కేఆర్ భవన్ మొత్తాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు.

మర్కజ్‌కు వెళ్ళివచ్చిన తర్వాత వివిధ ఆసుపత్రుల్లో మరణించిన ఆరుగురికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. మరికొద్దిమందికి ఇన్‌ఫెక్షన్ ఉన్నందున వారి ద్వారా ఇతరులకు సోకకుండా ఉండేందుకు వారిని గుర్తించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సోమవారం పదిహేను మందికి పాజిటివ్ ఉన్నట్లు గాంధీ ఆసుపత్రి పరీక్షల్లో తేలింది. దీంతో మొత్తం యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 77కు పెరిగింది. మరోవైపు జిల్లాలవ్యాప్తంగా మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారిని గుర్తించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళినవారిలో సగం మంది హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి గుర్తింపు మొదలైంది. వారికి ఆరోగ్య పరీక్షలు చేసి క్వారంటైన్‌కు తరలించారు. దేశవ్యాప్తంగా మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారిలో పాజిటివ్ లక్షణాలు కనిపించడం ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించింది.

గోప్యంగా అధికారిక లెక్కలు

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళివచ్చినవారు 369 మంది ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఏయే జిల్లాల నుంచి ఎవరెవరు వెళ్ళారో మొబైల్ నెంబర్లతో సహా గుర్తించి బహిర్గతం చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అధికారికంగా లెక్కలను బహిర్గతం చేయలేదు. కరోనాను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఇండోనేషియా నుంచి మతప్రచారం కోసం కరీంనగర్ జిల్లాలో పర్యటించినవారిలో పాజిటివ్ లక్షణాలు బయపడడంతో వెంటనే జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన ఆరుగురికీ మర్కజ్ మసీదుతో సంబంధం ఉందని స్పష్టం చేసింది. సోమవారం కొత్తగా వచ్చిన మొత్తం పదిహేను కేసులూ మర్కజ్‌తో సంబంధం ఉన్నవేనని స్పష్టం చేసింది. మర్కజ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినా మొత్తం ఎంత మంది వెళ్ళివచ్చారు, ఎంతమందిని గుర్తించారు, వారి ద్వారా ఎంత మంది కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కు వెళ్ళారు తదితరాలేవీ అధికారికంగా వెల్లడి కాలేదు. నిజంగానే వివరాలు మొత్తం తెలియనందన ప్రకటించలేకపోయిందా లేక గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతోనే బహిర్గతం చేయలేదా అనేదానిపై అధికారులు కూడా స్పందించడంలేదు.

మర్కజ్‌కు వెళ్ళివచ్చి పద్నాలుగు రోజుల సమయాన్ని పూర్తిచేసుకున్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండడంతో పాజిటివ్ బారిన పడలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పశు సంవర్ధక శాఖకు చెందిన ఉద్యోగి కూడా ఈ నెల 13న వెళ్ళి 15 వరకు అక్కడే ఉండి 16న హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇప్పటికీ ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పద్నాలుగు రోజులైనా లక్షణాలు లేకపోవడం ఒకింత ఉపశమనమే అయినా ఆ శాఖ కార్యదర్శి మాత్రం వైద్యారోగ్య శాఖకు లేఖ రాసి పూర్తిస్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోరారు. మర్కజ్‌కు వెళ్లివచ్చినవారందరినీ పూర్తిస్థాయిలో గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని, వారితో కాంటాక్టులోకి వెళ్ళిన కుటుంబ సభ్యులు సహా అందరి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో, ఏ మేరకు నివారించవచ్చో స్పష్టత వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed