బల్దియాలో శవరాజకీయాలు.. చర్చనీయాంశంగా మారిన కమిషనర్ వైఖరి

by Anukaran |   ( Updated:2021-08-12 23:01:27.0  )
GHMC
X

దిశ, సిటీ బ్యూరో : బల్దియానే నమ్ముుకుని జీవించే కార్మికులు వారు. నిత్యం శ్రమదోపిడికి గురవుతూ, అధికారులకు చాకిరి చేస్తూ అరకోర జీతంతో బతుకునీడ్చే బడుగు జీవులు. ఎలాగో వారి బతికున్నపుడు వారిని మనుషులుగా చూడని బల్దియా అధికారులు కనీసం వారు చనిపోయిన తర్వాత కూడా వారి పేర్లను వాడుకుంటూ వారి ఉనికిని కాపాడుకుంటున్నారు. శవాల పేర్లు చెప్పి బతికే అధికారులు గొప్పవారా? ఏళ్లు కార్పొరేషన్ కు సేవలందించి, చనిపోయిన తర్వాత తమ కుటుంబానికి పైసా పరిహారమివ్వకపోయినా మా బతుకులింతేనని, దేవుడిపై భారమేసి బతికే కార్మిక కుటుంబాల ఉదారత గొప్పదా? అన్నదీ పాలకులే నిర్ణయించాలి.

ఉన్నతమైన చదువులు చదివి, గౌరవ ప్రదమైన హోదాలో కొనసాగుతున్న పలువురు బల్దియా ఉన్నతాధికారులు చివరకు శవ రాజకీయాలు చేసేందుకు దిగజారారు. ఉన్నత న్యాయస్థానాలు, న్యాయస్థానాలు, పాలకులు, ఉన్నతాధికారులు, చివరకు జాతీయ స్థాయి కమీషన్లను సైతం లెక్క చేయకుండా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు చనిపోయిన కార్మికులతో తమకేమీ సంబంధం లేదంటూనే ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ. 12 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందజేసిన బల్దియా, కొవిడ్ తో మృతి చెందిన బల్దియా కార్మికులకు ఎలాంటి పరిహారం చెల్లించనిదే ఒక్కో కుటుంబానికి రూ.14లక్షల చెల్లించామంటూ జాతీయ సఫాయి కర్మాచారి కమిషన్ ను తప్పుదోవ పట్టించారని పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మొదటి దశ విజృంభణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేసి, కొవిడ్ తో మృతి చెందిన 25 మంది కార్మికుల కుటుంబాలకు రూ. 14 లక్షల చొప్పున నష్టపరిహారాన్నిచ్చామని కమిషన్ కు చెప్పిన కమిషనర్, ఆ కార్మికుల జాబితాను అధికారికంగా విడుదల చేయటం లేదు. మహానగర వాసుల్లో హాట్ టాపిక్ గా మారిన శవ రాజకీయాలకు పాల్పడుతున్న ఉన్నతాధికారులపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేసేందుకు బల్దియాలోని ఉద్యోగ, కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి.

ఈ నెల 3వ తేదీన ఎల్బీనగర్ పద్మావతి నగర్ లో డ్రైనేజీ నుంచి పూడికను తొలగించేందుకు శివ, అంతయ్య అనే ఇద్దరు కార్మికులు అందులో పడి చనిపోయి 24 గంటలు కూడా గడవకముందే కార్మికుల మృతితో తమకేమీ సంబంధం లేదని అధికారికంగా ప్రకటన జారీ చేశారు అధికారులు. ఘటన జరిగేందుకు తమ నిర్లక్ష్యమే కారణమన్న వాస్తవం వెలుగులోకి రావటంతో గల్లంతైన అంతయ్య మృతదేహాం ఆచూకీ కనుక్కునేందుకు ఏడు రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మృతదేహాలు లభ్యమైన తర్వాత ఒక్కో కార్మికుడి కుటుంబానికి రెండు దఫాలుగా రూ.12లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా చెల్లించటం చర్చనీయాంశంగా మారింది. కార్మికుల మృతితో సంబంధమే లేదని తేల్చి చెప్పిన బల్దియా అధికారులు, ఆ తర్వాత ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయటంతో పాటు మరో ఇద్దరు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు. ఘటన జరిగిన రోజున పనులు పర్యవేక్షించే సూపర్ వైజర్ కార్మికులు శివ, అంతయ్యలను పనులు చేయాలని బలవంతంగా తీసుకువచ్చిన విషయం కూడా బయట పడటం, రాత్రి పూట పనులు చేపట్టడం ముమ్మాటికీ నిబంధనలకు విరుద్దమేనని, తమ ఏరియాల్లో రాత్రి పనులు జరుగుతుంటే ఆపటంలో విఫలమైన అధికారులను సస్పెన్షన్ చేసిన ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులిచ్చిన రాములు, భద్రూనాయక్ అనే ఇంజనీర్లను ఒకరిని వరంగల్ కు, మరొకరిని జగిత్యాల మున్సిపాల్టీకి బదిలీ చేయటంలో ఆంతర్యమేమిటీ?అన్న చర్చ లేకపోలేదు.


ఎవ్వరూ పైసా ఇవ్వలేదు

-కొవిడ్‌తో మృతి చెందిన బల్దియా కార్మికుడి కుటుంబ సభ్యుడు
‘డాడీ సెంట్రల్ జోన్ లో బల్దియా అత్యవసర సర్వీసులందించే ఓ విభాగంలో ఔట్ సోర్సు కార్మికుడిగా పనిచేసేవాడు. మొదటి దఫా లాక్ డౌన్ లోనూ ఫ్రంట్ లైన్ వారియర్ గా విధులు నిర్వర్తించి, చివరకు కొవిడ్ సోకి మృతి చెందాడు. నాటి నుంచి మా కుటుంబం ఎన్నో కష్టాలు పడుతుంది.’ కొవిడ్ తో మృతి చెందిన బల్దియా కార్మికుడి కొడుకు చెప్పిన మాటలివి. అదేంటీ మీకు ఒక్కో కుటుంబానికి బల్దియా రూ.14 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చామని కమిషనర్ చెబుతున్నారు కదా! అని ప్రశ్నించగా..‘అన్నీ అబద్దాలు, మాకు ఏ ఒక్కరూ, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఎక్కడికొచ్చి చెప్పుమన్నా, చెబుతాం’ అని వాపోయారు. తన పేరు బయటపడితే అధికారులేం చేస్తారోనన్న భయంతో అతనిలో కన్పించటం, అక్రమార్కులైన అధికారుల క్రూరత్వానికి నిదర్శనం.


కమిషనర్ జాబితా బయటపెట్టాల్సిందే

కొవిడ్‌తో మృతి చెందిన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ. 14లక్షలిచ్చామని జాతీయ సఫాయి కర్మాచారి కమిషన్ కు చెప్పిన కమిషనర్, పరిహారం తీసుకున్న కార్మికుల వివరాలను బయటపెట్టాలని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్(జీహెచ్ఎంఈయూ), బేజేపీ మజ్దూర్ మోర్చా సిటీ కన్వీనర్ ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. కమిషనర్ కమిషన్ కు చెబుతున్నప్పుడే తనకు అనుమానాలున్నాయని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కమిషనర్ పరిహారమిచ్చిన కార్మికుల జాబితా బయటపెట్టే వరకు తాము ఆందోళనలు చేపడుతామని గోపాల్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed