ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్‌ పదవి ఎవరికి?

by Anukaran |
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్‌ పదవి ఎవరికి?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11వ తేదీన జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఏదేని ఒక జిల్లా కలెక్టర్‌ను మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రిసైడింగ్ అధికారిగా ఎంపిక చేయాలని ఆ నోటిఫికేషన్‌లో కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12.30 గంటలకు కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేసింది.

మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోడానికి జరిగే సమావేశం కంటే ముందే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని పేర్కొంది. ఆ రోజు ఉదయం 11.00 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జీహెచ్ఎంసీకి ఎన్నికల అథారిటీగా ఉన్న కమిషనర్ ఒక కలెక్టర్‌ను ప్రిసైడింగ్ అధికారి చేత చేయించాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి కొత్త కార్పొరేటర్లందరికీ ఫిబ్రవరి 6వ తేదీ లోగా ఫామ్-2 ప్రకారం నోటీసు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆ నోటిఫికేషన్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి పేర్కొన్నారు.

ఒకవేళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఫిబ్రవరి 11వ తేదీన జరిగే సమావేశంలో స్పష్ట రాకపోయినట్లయితే తదుపరి సమావేశాన్ని ఆ మరుసటి రోజు (సెలవు ఉన్నప్పటికీ) నిర్వహించాలని పేర్కొన్నారు. మేయర్ ఎన్నిక జరగకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగడానికి వీల్లేదని 2005 మున్సిపల్ ఎన్నికల చట్టంలోని నిబంధనను గుర్తుచేశారు.

Advertisement

Next Story