హైదరాబాద్​ ఫుడ్​.. వెరీ బ్యాడ్​!

by Shyam |   ( Updated:2020-02-18 06:16:50.0  )
హైదరాబాద్​ ఫుడ్​.. వెరీ బ్యాడ్​!
X

ఈయన పేరు మల్లిక్. భోజన ప్రియుడు. బిర్యానీ అంటే మహాఇష్టం. వారంలో రెండుసార్లు బిర్యానీ రుచి చూడందే ఆగలేడు. ఒకరోజు ఉదయం కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అజీర్తి, విరోచనాలు… ఆయన బాధ వర్ణనాతీతం.

ఈయన పేరు సుభాష్. ఐటీ ఉద్యోగి. ఐదంకెల జీతం. పర్సు ఎప్పుడూ టైట్‌గానే ఉంటుంది. వారంలో కనీసం ఒక్కసారైనా ఖీమా రుచి చూడవలసిందే. ఇంటికి, ఒంటికంటే దోశెలంటే వల్లమాలిన ప్రేమ. అందులోనూ నాన్‌వెజ్ అంటే ఇంకా ఇష్టం.

ఈమె పేరు సుహాసిని. వెజ్ అంటే వల్లమాలిన ప్రేమ. హైదరాబాద్‌లో వెజ్ వంటకాల్లో పేరుగాంచిన హోటళ్ళన్నీ చిరపరిచితం. ఆ ప్రాంతాలన్నీ కరతలామలకం. వంటలకు తగినట్లుగా హోటళ్ళను వెతికి మరీ రుచి చూస్తుంది. కానీ బ్యాడ్ లక్. నెలరోజులు మంచం మీద నుంచి కదిలితే ఒట్టు.

ఇవన్నీ హైదరాబాద్ భోజనప్రియుల కష్టాలు, బాధలు. ప్రపంచస్థాయి నగరంలో తిండి కల్తీ తిప్పలివి. వీళ్ళలో హైదరాబాద్ ఫుడ్ గురించి వీరిలో ఏ ఒక్కరినీ అడిగినా వెరీ బ్యాడ్ అంటూ ఏకవాక్య సమాధానమే వస్తుంది. ఇలాంటివారు హైదరాబాద్‌లో కోకొల్లలు.

తిండే మన బ్రాండ్ అని మన ప్రభుత్వం చెప్తున్నది. కానీ, వినియోగదారులు మాత్రం బ్యాడ్ బ్యాడ్ అని అంటున్నారు. హైదరాబాద్ ఫుడ్ నిజంగానే అంత బ్యాడా? ఎందుకు? తాజా లెక్కలు చెప్తున్నదేంటి? తాజా ఘటనలు తేల్చిందేంటి? ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం.

బిర్యానీ, వెరైటీ ఫుడ్​ను అందించడంలో హైదరాబాద్​కు అంతర్జాతీయస్థాయిలో ఉన్న గుర్తింపే వేరు. మాంసాహార ప్రియులు ఇష్టపడే థమ్ బిర్యానీకి యమ డిమాండ్ ఉంటుంది. కేటీఆర్ సైతం హైదరాబాద్ బ్రాండ్ బిర్యానీ గురించి ట్విట్టర్‌లో గొప్పగా చెప్పుకున్నారు. అయితే నగరంలో లభిస్తున్న ఆహారం అంతా సురక్షితమేనా? నోరూరించే బిర్యానీ నాణ్యమైనదేనా? నాణ్యతపై ఇప్పుడు భోజనప్రియులకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మధ్యన గొప్పగొప్ప హోటళ్ళపై జరిపిన సోదాలు విస్తుపోయే అంశాలను వెలుగులోకి తెచ్చాయి.

నిత్యం జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు హోటళ్ళలో ఆహారపదార్థాల రుచి చూడాలి. సర్టిఫై చేయాలి. ప్రతీరోజు జరగాల్సిన ఆ పనులు ఎందుకు మొక్కుబడిగా జరుగుతున్నాయి? సోదాల ఫుడ్​ సేఫ్టీని పర్యవేక్షించాల్సిన అధికారులు ఎందుకు పకడ్బందీగా వ్యవహరించడంలేదు. ఇందుకు కారణం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల కొరతే. బల్దియాను చాలాకాలంగా ఈ సమస్య వేధిస్తోంది. తరచూ ఫుడ్​ పాయిజనింగ్​, కల్తీ ఆహారం గురించి వార్తలు వస్తున్నా, అనుమానాలు వెంటాడుతున్నా నివృత్తి చేసే అవకాశమే లేకుండా పోయింది. అడపాదడపా ఒకటో, రెండో సోదాల అనంతరం భయం పుట్టించేవార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బేగంపేట్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఓ అబ్బాయి చనిపోయిన ఘటన మరోసారి ఆహార నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది.

హైదరాబాద్ నగరం ఉరుకులు, పరుగుల జీవనంలో చాలామంది ఇంటి వంటతోపాటు సమానంగా బయట కూడా తింటుంటారు. ఉదయం టిఫిన్ మొదలు పెడితే రాత్రి డిన్నర్ వరకు ఏదో ఒక సమయంలో సిటీలో చాలామంది ఔట్‌సైడ్ ఫుడ్ తీసుకోవడం సర్వసాధారణమైంది. అంత భారీగా డిమాండ్ ఉంది కాబట్టే దానిని క్యాష్​ చేసుకుంటున్న కొంతమంది వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్​ తయారీ నిర్వహణ సక్రమంగానే జరుగుతోందా అంటే అధికారవర్గాలు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. నగరంలో ఆహార కల్తీ జరగకుండా చూడాల్సిన అధికారులు ముగ్గరంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు.

2007 బల్దియా ఏర్పాటు అయినప్పుడే 26 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరమనే నిర్ణయం జరిగింది. కానీ, అది అక్కడికే పరిమితమైంది. పదమూడేళ్ళ తర్వాత 2020లో కూడా నలుగురు అధికారులు మాత్రమే ఉన్నారు. దీన్నిబట్టి జీహెచ్ఎంసీ చిత్తశుద్ధి ఏపాటిదో తెలిసిపోతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ నగరం పరిధిలో 25 వేల వరకు ఆహార విక్రయశాలలు ఉన్నట్టు అంచనా. బల్దియా పరిధిలోకి వచ్చే 30 సర్కిళ్లలో 15 వేల ఆహార సంబంధిత వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఒక్కో సర్కిల్​కు సగటున 800 నుంచి 1,200 వరకు టిఫిన్ సెంటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు, మాంస దుకాణాలు, మాల్స్ వంటి ఫుడ్ వెండర్స్ ఉన్నారు.

అధికారులు చేస్తున్న దాడుల్లో కల్తీ ఫుడ్ భాగోతాలు భయపడుతూనే ఉన్నాయి. అప్పటికప్పుడు ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కోసారి కొన్ని గంటలపాటు హోటళ్ళను సీజ్ చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనను జరిమానాతోనే సరిపెడుతున్నారు. రెగ్యులర్​గా తనిఖీలు నిర్వహించకుండా చేతులు దులుపుకుంటున్నారు. నూనె, కారం, పసుపు వంటి పదార్థాల్లో రంగులు కలపడం, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలుతోపాటు పండ్లను మగ్గించేందుకు వాడుతున్న రసాయనాలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బల్దియా అధికారులు తనిఖీ చేసినప్పుడు ఆయా హోటళ్ళలో నిల్వ ఉంచిన ఆహారం, కుళ్లిన ఆహారం, స్టాంప్ లేని మటన్ ఉపయోగించడం వంటి అక్రమాలు బయటపడుతున్నాయి.
ఇలాంటి కల్తీ వల్ల ఫుడ్ పాయిజన్ అయి అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు కారణమవుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. ఇక అల్సర్, విరోచనాల సంగతి సరేసరి. బల్దియాలో తనిఖీలు చేయడానికి నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. కేవలం ముగ్గురు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఉన్నారు. వచ్చిన ఫిర్యాదులపై ఫీల్డ్ విజిట్ చేసి శాంపిల్స్ సేకరించేందుకు పరిమితం కావాల్సి వస్తోంది. హోటళ్ళలో వంటలు ఎలా చేస్తున్నారో రెగ్యులర్‌గా తనిఖీ చేయడం గగనమైపోతోంది. వాడుతున్న పదార్థాల్లో ఏమైనా కల్తీలు ఉన్నాయా? కిచెన్, సప్లయింగ్ సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు తదితర అంశాలపై నిఘా అసలే లేదు.

ఫుడ్​ సేఫ్టీ నిర్వాహణలో లోపం, పుడ్​ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్​తోపాటు తెలంగాణలో కూడా ఫుడ్ సేఫ్టీ నిర్వాహణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది.

బల్దియా పరిధిలో అధికారుల కొరత, పీరియాడికల్ తనిఖీలు లేకపోవడం చివరకు ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టింది. రెగ్యులర్​గా అధికారులు తనిఖీలు చేస్తే వందలాది అక్రమాలు, లోపాలు, లోసుగులు బయటపడతాయి. కల్తీని అరికట్టి ప్రజల అనారోగ్య సమస్యను తగ్గించవచ్చు. ఆహారప్రియులు కూడా తాము తింటున్నవాటి నాణ్యత, పరిశుభ్రత అంశాలపై దృష్టి సారిస్తే ఆరోగ్యాలను కాపాడుకున్నవారవుతారు.

Advertisement

Next Story

Most Viewed