‘బల్దియా’.. టీఆర్ఎస్ ప్లాన్ కర్దియా!

by Shyam |
‘బల్దియా’.. టీఆర్ఎస్ ప్లాన్ కర్దియా!
X

టీఆర్ఎస్ అనుకున్నట్లుగా అన్ని మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, మేయర్ పోస్టుల్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు జీహెచ్ఎంసీపై దృష్టి పెట్టింది. ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ ‘ముందస్తు’ అనుమానాలు బలంగానే ఉన్నాయి. ఈసారి కూడా జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కన్నేసింది. ఇప్పటి నుంచే ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం పనిచేస్తున్న ‘బస్తీ దవాఖాన’ల సంఖ్య పెంచడంపై దృష్టి పెట్టింది. ఇప్పుడున్న 123 బస్తీ దవాఖానలకు అదనంగా మరో 177 నెలకొల్పాలని భావిస్తోంది. టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహంలో ఇది ఒక అంశం మాత్రమే. రానున్న కాలంలో ఇలాంటి ఇంకెన్ని అదనపు హంగులు తీసుకురానుందో!

లోక్‌సభ ఎన్నికల మొదలు ఎంతో కొంత స్థాయిలో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం పెరుగుతుండడం, కాంగ్రెస్ పుంజుకోవడం టీఆర్ఎస్‌కు గుబులు రేకెత్తిస్తోంది. అందుకే ఒక దశలో ‘కాంగ్రెస్‌ను మేం అంత తక్కువగా అంచనా వేయడంలేదు’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. క్రితంసారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న కేటీఆర్ ఈసారి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వాటిని స్వయంగా పర్యవేక్షించనున్నారు. కార్పొరేటర్‌ల ఎంపిక, వారిని గెలిపించుకునే బాధ్యతలను కూడా ఆయనే తీసుకోనున్నారు. నగరంలో స్థిరపడిన రాయలసీమ ప్రజల ఓటు బ్యాంకును ఆకర్షించడానికి వైఎస్ఆర్‌సీపీ నాయకుల సహాయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్‌తో స్నేహసంబంధాలున్నాయనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది.

అదే సమయంలో బీజేపీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హిందూ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవడంపై దృష్టి పెట్టాలనుకుంటోంది. అందులో భాగమే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నామమాత్రపు ప్రచారానికి పరిమితమై హిందూ ఓటర్లు ఉన్న ఏరియాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టనుంది. అర్బన్ ఓటు బ్యాంకే బలమని భావిస్తున్న బీజేపీ జీహెచ్ఎంసీలో గెలుపును రానున్న అసెంబ్లీ ఎన్నికలనాటికి శాంపిల్‌గా చూపించాలనుకుంటోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా భావిస్తున్న టీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ప్రజాకర్షక పథకాలను, వాటి అమలును ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలనుకుంటోంది.

కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం రోడ్లు తదితరాలపైనే రానున్న కాలంలో టీఆర్ఎస్ దృష్టి పెట్టనుంది. ప్రస్తుతానికి ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలను నెలకొల్పింది. వీటి సంఖ్యను మరింత పెంచడం ద్వారా ఓటు బ్యాంకును ఆకర్షించాలనుకుంటోంది. మున్ముందు సిమెంటు రోడ్లు, వైట్ ట్యాప్ రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలకు అదనపు నిధులు, ఆదునికీకరణ పనులు… ఇలా కీలక అంశాలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed