- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డబుల్’ చుట్టూ గ్రేటర్ రాజకీయాలు
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ రాజకీయాలు డబుల్ బెడ్రూం పథకం చుట్టే తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్కు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఇదే ప్రధాన ప్రచార అస్ర్తంగా మారనుంది. డబుల్ బెడ్ రూం ఇండ్లు ‘లక్ష’ లక్ష్యాన్ని చేరుకోలేదని కాంగ్రెస్ పార్టీ సర్కార్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తుండగా, డిసెంబర్ నాటికి 85 వేల ఇండ్లను లబ్ధిదారులకు ఇస్తామని అధికార టీఆర్ఎస్ చెబుతున్నది. మొత్తంగా నాలుగు నెలల్లో బల్దియా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇరు పార్టీలూ ఇదే ప్రధాన ఆయుధంగా ప్రచారంలో పావులు కదిపేందుకు ప్రణాళిక రచన చేస్తున్నాయి. కాంగ్రెస్ దూకుడుతో డబుల్ ఇండ్లను ఇచ్చినా, ఇవ్వకపోయినా అధికార పార్టీకి సంకటంగా మారనుంది.
పరస్పర ఆరోపణలు..
గ్రేటర్లో పేదలకు లక్ష ఇండ్లను నిర్మించి ఇస్తామని అధికార పార్టీ చెబుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించడం లేదని, సరిహద్దు జిల్లాల్లో నిర్మించిన ఇండ్లను గ్రేటర్లో ఉన్నట్టు చెబుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే. కాగా, 2016 గ్రేటర్ ఎన్నికల ముందునాటి నుంచే టీఆర్ఎస్ డబుల్ బెడ్ రూం హామీనిచ్చింది. డబుల్ స్కీం ప్రధాన హామీగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాలుగేండ్ల నుంచి ఇండ్లను అందిస్తామని చెబుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే ఇండ్ల స్థలాల కోసం భూమి ఇచ్చిన 8,848 మందికి కూడా పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు ఇండ్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూం కోసం ప్రగతి భవన్ ముందే తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే డిసెంబర్ లోనే ముందస్తు బల్దియా ఎన్నికలకు వెళ్తారన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలు డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రధాన ప్రచార ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఈ ఏడాది ఇండ్లను అందిస్తామని టీఆర్ఎస్ చెబుతుండగా, నాలుగేండ్లలో సాధ్యం కానిది ఇప్పుడు ఎలా చేస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గ్రేటర్లో ఇప్పటివరకు 30 వేల ఇండ్ల నిర్మాణాలు కూడా పూర్తికాలేదని ఆ పార్టీ వాదిస్తోంది. మొత్తంగా 85 వేల ఇండ్లను ఇస్తామన్న కేటీఆర్, ఆగస్టు నాటికి 50 వేల ఇండ్లను ఆల్రెడీ అందజేస్తామని నాలుగు నెలల కిందటే ప్రకటించారు. స్వయానా మంత్రి ప్రకటించినా అది ఆచరణలో పూర్తి కాలేదు. దీంతో అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్న ప్రకటన ఎలక్షన్ల ఎత్తుగడ మాత్రమేనని విపక్షాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నన్నీ రోజులు చేయలేకపోయినా అదే అస్ర్తంతో ప్రజల్లోకి వెళ్లాలని అధికార, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
పంపకంపైనా అధికార పార్టీ తర్జనభర్జన..
డబుల్ స్కీంలో ఇప్పటికే పంపిణీ చేసిన ఇండ్లలో రాజకీయ, అధికార పలుకుబడి ఉన్నవారికే కేటాయిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. పేదలకు కేటాయించాల్సిన ఇండ్లలో అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవారికి కోటా ప్రకారం ఇండ్ల కేటాయింపులు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతిపాదిత లక్ష ఇండ్ల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 6.11 లక్షల దరఖాస్తులు అందినట్టు సమాచారం. దాదాపు మూడేండ్ల నుంచి జిల్లా కలెక్టర్లు దరఖాస్తులు తీసుకోవడం లేదు.
నత్తనడకన సాగుతున్న ఇండ్ల నిర్మాణాలు, కేటాయింపుల్లో అర్హులకు జరుగుతున్న అన్యాయం అధికార పార్టీకి వ్యతిరేక పవనాలుగా మారుతున్నాయి. డబుల్ ఇండ్లను పక్కకు పెట్టినా అంతకుముందు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కూడా చేయలేదు. దీంతో అన్ని నిర్మాణాలు కూలిపోతున్నాయి. తలుపులు, కిటీకీలు ఊడదీసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించాలా వద్దా అన్నది అధికార పార్టీకి సమస్యగా మారుతోంది. ఇండ్లు ఇచ్చినవారు ఓట్లు వేస్తే దక్కనివారి ఓటు బ్యాంకు కోల్పోవాల్సి వస్తుంది. అందరికీ ఇండ్లు ఇవ్వాలంటే ఇప్పటికే అందిన సంఖ్యకు సమానమైన నిర్మాణాలు లేవు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్కు ప్రధాన సమస్యగా మారగా, ప్రతిపక్షాలకు ముఖ్యమైన ఆయుధంగా మారింది.