- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెన్సీ నోట్లతో కరోనా వస్తుందా..?
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు ఇప్పుడు కరెన్సీ నోట్లకూ ఆ ముప్పు పొంచి ఉంది. తుమ్మితేనో, దగ్గితేనో, చేత్తో ముట్టుకుంటేనో వైరస్ వస్తుందని మనం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. కానీ కరెన్సీ నోట్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందా అనేది ఆశ్చర్యంగానే ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొద్దిమందికి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత పోలీసులు, వైద్యుల విశ్లేషణలో కరెన్సీ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్న అంచనాకు వచ్చారు. అందుకే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఏకంగా కరెన్సీ నోట్లతో తస్మాత్ జాగ్రత్త అని ప్రజలను అప్రమత్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ సైతం కరెన్సీ నోట్లతో వైరస్ వ్యాపించే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు. వీరే కాదు డాక్టర్లూ దీన్ని కొట్టిపారేయలేమని, జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. ఇక బ్యాంకు ఉద్యోగులకు వారి సంఘం ఏకంగా ఒక సర్క్యులర్‌నే జారీ చేసింది. వినియోగదారుల నుంచి కరెన్సీ నోట్లను తీసుకునేటప్పుడు కనీస జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేసింది.
ఇన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు వస్తున్నందునే ప్రజలు సైతం కరెన్సీ నోట్లను ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఎలాగూ బ్యాంకులు, మొబైల్ సర్వీసు ప్రొవైడర్లు, సూపర్ మార్కెట్లు కరెన్సీ నోట్లకు బదులుగా డిజిటల్ లావాదేవీలు జరపాలని కోరుతున్నాయి. మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్‌లు పంపుతున్నాయి. అయినా కరెన్సీ నోట్ల చెలామణి జరుగుతూనే ఉంది. మన దైనందిన జీవితంలో కరెన్సీ నోట్లు ఎన్ని చేతులు మారుతాయో ఊహించలేం. వాటి ద్వారా ఎన్ని రకాల వైరస్‌లు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి చేరుతాయో అంచనా వేయలేం. అందుకే కొన్ని చోట్ల బ్యాంకు ఉద్యోగులు ఏకంగా కరెన్సీ నోట్లను వేడిగా ఉండే ఇస్త్రీపెట్టెతో రుద్దిన తర్వాత ముట్టుకుంటున్నారు. పైగా బ్యాంకు ఉద్యోగులంతా విధిగా చేతులకు గ్లౌజులు వేసుకుంటున్నారు. ఒక్క కరెన్సీ నోట్ల కోసం ఇన్ని తిప్పలు పడాల్సి వస్తోంది. సూర్యాపేటలో ఎలాంటి ప్రయాణం చేయని, మర్కజ్ వెళ్ళొచ్చినవారితో సంబంధం లేని ఒక మహిళకు పాజిటివ్ రావడం వెనక కారణం కరెన్సీ నోట్లే అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందులో భాగమే ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఎస్పీ సందేశం ఇవ్వడం.
మన చుట్టూ ఉండేవారిలో ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో ఇప్పటికీ అంచనాకు అందడంలేదు. అలాంటి వ్యక్తులు ఏ వస్తువులు ముట్టుకున్నారో, దాని ద్వారా వైరస్ ఎక్కడెక్కడ తిష్ట వేసిందో తెలియక నగరమంతా సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో జీహెచ్ఎంసీ సిబ్బంది పిచికారీ చేశారు. వారు తాకిన వస్తువులపై వైరస్ ఉంటుందనేది అనుమానమే కాదు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన వాస్తవం కూడా. అలాంటి వస్తువులను రసాయనిక ద్రావణంతో పిచికారి చేయడం ద్వారా వైరస్‌ను చంపినప్పుడు కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించే వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి మార్గం లేకుండా పోయింది. అందుకే గ్లౌజులు, ఇస్త్రీపెట్టె లాంటి స్వీయ జాగ్రత్తలు. వైరస్ ఇందుకలదు.. అందు లేదు.. అనే సందేహానికి ఆస్కారంలేకుండా రిస్కులో పడేకంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని డీజీపీ, ఎస్పీ, బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాపించొచ్చు : డాక్టర్ నర్సింగ్ రెడ్డి
”కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందవచ్చనేది అనుమానం మాత్రమే కాదు. శాస్త్రీయంగా రుజువైంది కూడా. ఈ వైరస్ చైనాలోని ఊహాన్‌లో వెలుగులోకి వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా లారీలకొద్దీ కరెన్సీ నోట్ల కట్టలను ‘అల్ట్రా వయోలెట్’ కిరణాల ద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేసింది. సుమారు 15 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. వైరస్ స్వభావాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఏయే వస్తువుల మీద వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుందనేదాన్ని విశ్లేషించారు శాస్త్రవేత్తలు. లోహం మీద మూడు రోజులు, పేపర్ మీద నాలుగు గంటలు, ప్లాస్టిక్ మీద రెండు గంటలు, మనుషుల చర్మం మీద ఇరవై నిమిషాలు.. ఇలా లెక్కతీశారు. ఆ ప్రకారం కరెన్సీ నోట్లపై వైరస్ నాలుగైదు గంటలపాటు ఉండిపోతుంది. అందుకే న్యూస్ పేపర్ల డెలివరీ ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదాన్ని అంచనా వేశారు. ప్రింట్ మీడియా సంస్థలు దీన్ని విమర్శించి తప్పుపట్టినా పేపర్ తనంతట తానుగా వైరస్‌ను మోసుకొచ్చేది కాకపోయినా దాన్ని డెలివరీ చేస్తున్న మనుషుల ద్వారా వ్యాపించవచ్చని అర్థం చేయించాం. ఇప్పుడు నిత్యావసర వస్తువుల కోసం సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడి షెల్ఫుల్లో కనిపించే ప్యాకెట్లు, పాలిథీన్ కవర్, పేపర్ కవర్ ద్వారా మాత్రమే కాకుండా క్యాష్ కౌంటర్ దగ్గర ఉండే మనుషులు, వారి నుంచి కరెన్సీ ద్వారా మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఇదే తీరులో సెలూన్‌లు, దోబీఘాట్‌లు కూడా వైరస్‌ను వ్యాప్తి చేసే కేంద్రాలు అని నిర్ధారణ అయింది. అమెరికాలో సగం పాజిటివ్ కేసులు సెలూన్‌ల ద్వారానే వ్యాపించినట్లు విశ్లేషణలో తేలింది. అందువల్ల కరెన్సీ నోట్ల విషయంలో ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. “
అందుకే మేం జాగ్రత్తలు తీసుకుంటున్నాం : బీఓబీ బ్యాంక్ మేనేజర్ రాజేష్‌రావు
”కరోనా వైరస్ వ్యాపించడానికి ఏదో ఒక మాధ్యమం ఉండాలి. పాలప్యాకెట్, న్యూస్ పేపర్ల లాగానే కరెన్సీ నోట్లు కూడా ఒక మాధ్యమం. వైరస్ వ్యాప్తి చెందదని కొట్టిపారేయలేం. చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖానికి మాస్కు పెట్టుకుంటున్నట్లుగానే చేతులకు కూడా గ్లౌజులు వేసుకుని పనిచేస్తున్నాం. గ్లౌజులు లేకుండా కరెన్సీ నోట్లను ముట్టుకోవడంలేదు. కానీ గ్లౌజులు వేసుకున్నప్పుడు నోట్లను లెక్కించలేం కాబట్టి కౌంటింగ్ మిషన్లను వాడుతున్నాం. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ ప్రమాదాన్ని గుర్తించినందువల్లనే లోపలకు వచ్చే వినియోగదారులందరికీ తొలుత శానిటైజర్ ఇచ్చి చేతుల్ని శుభ్రం చేసుకోవాలని చెప్తున్నాం. దాన్ని అమలు చేయిస్తున్నాం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకు యాజమాన్యం మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ మా బ్యాంకు ఉద్యోగుల సంఘం మాత్రం మా జాగ్రత్తల కోసం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. కరెన్సీ నోట్లను చేతితో పట్టుకోవద్దని స్పష్టం చేసింది. దాన్ని అన్ని బ్యాంకుల ఉద్యోగులూ పాటిస్తున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందంటే చాలా మంది నమ్మకపోవచ్చుగానీ మనం ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు”