బిగించి పదేళ్లు అయినా ప్రారంభానికి నోచుకోలేదు

by Shyam |
బిగించి పదేళ్లు అయినా ప్రారంభానికి నోచుకోలేదు
X

దిశ, భువనగిరి: కార్యాలయాల్లో పనులకు, సమావేశాలకు ఆటంకం కలుగకూడదనే సంకల్పంతో.. 2010లో అప్పటి ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలకు జనరేటర్లను సరఫరా చేసింది. వాటిని బిగించి పదేళ్లు దాటింది ఇంకా వినియోగానికి నోచుకోలేదు. వాటిని పట్టించుకునే నిధులు లేక పిచ్చి మొక్కల మధ్య అవి నిరుపయోగంగా మారాయి. ఒక్కొక్క దానికి రూ.4.10 లక్షలు వెచ్చించి నిరూపయోగంగా వదిలివేయడంతో లక్షల్లో ప్రజాధనం వృథా అయింది.

విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగిన సమయంలో వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతోపాటు కంప్యూటర్లు నిరంతరాయంగా పని చేయాలనే దృఢ నిశ్చయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీటీఎస్ ద్వారా మహేంద్ర కంపెనీకి చెందిన 5 కేవీ సామర్థ్యం గల జనరేటర్లను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిచ్చిన సదరు సంస్థ వాటిని బిగించింది తప్ప తహసీల్దార్ కార్యాలయాలకు అనుసంధానం చేయకుండా వదిలి వేశారు. వీటిని ప్రారంభించి మూడేళ్ళ పాటు నిర్వాహణ బాధ్యతలు చూడాల్సిన సంస్థ ముఖం చాటేసింది. బిల్లులు మాత్రం ఆ సంస్థకు ఆప్పటికే ముట్టాయి. కొన్ని మండలాల్లో అక్కడి తహసీల్దార్లు స్థానిక మెకానిక్‌లతో జననేటర్లను ప్రారంభించుకున్నప్పటికీ సరిగ్గా పని చేయకపోవడంతో అవి మూలనపడ్డాయి. అధికారులు సైతం మాకెందుకు ఆరాటం అన్న ట్లు పట్టించుకోవడం మానేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అప్పట్లో ఉన్న 59 మండలాలతో పాటు మూడు రెవెన్యూ డివిజన్ లకు జనరేటర్లను అందజేశారు. రెవెన్యూ డివిజన్లలో సైతం జనరేటర్లది ఇదే పరిస్థితి. మొత్తం 62 జనరేటర్లకు సంబంధించిన సొమ్ము రూ.2.55 కోట్లు నీళ్లలో పోసినట్లైంది.

దృష్టి పెడితే వినియోగంలోకి..

కొన్ని మండలాలలో అసలే ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న జనరేటర్లను వినియోగంలోకి తెచ్చే అవకాశాలున్నాయి. కొన్ని రోజులకే వివిధ కారణాలతో పని చేయకుండా మూలన పడ్డ జనరేటర్లు సైతం మరమ్మత్తులు చేపడితే వినియోగంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. కరెంట్ పోతే తహసీల్దార్ కార్యాలయాల్లో జనరేటర్ల ద్వారా పనులు సాగే పరిస్థితిలేదు. కరెంట్ వస్తేనే పని చేయాల్సిన పరిస్థితి. మరమ్మతులకు కాస్త నిధులు వెచ్చించి వినియోగంలోకి తెచ్చుకుంటే కరెంట్ పోయిన సమయంలోనూ సమావేశాలకు, పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని కింది స్థాయి ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed