- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మత్తెక్కిస్తున్న’ నల్లమల.. టార్గెట్ 25 ఏళ్లలోపు వారే..?
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయిని గత కొంత కాలంగా పోగుచేసి నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాదు, నల్లగొండ, ఏపీలోని కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాలకు కొందరు దుండగులు తరలిస్తున్నారు. ఈ చీకటి తతంగాన్ని కొందరు ఓ ముఠాగా ఏర్పడి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్న కొందరు అమాయకులను ఆసరాగా చేసుకొని దుండగులు గంజాయి సాగు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల, అమ్రాబాద్, పదరా, బల్మూరు తదితర మండలాల పరిధిలో మరియు గిరిజనుల ఆవాసాలు ఉన్నా ప్రాంతాల్లో గంజాయి సాగు జోరందుకున్నట్లు సమాచారం. గంజాయి సాగును ఎవరూ గుర్తించకుండా ఆహార, వాణిజ్య పంటలైనా కంది, మిరప, పత్తి తదితర పంటలతో పాటు అంతర్గతంగా సాగు చేస్తున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్ కేంద్రంగా..
విద్య, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే యువతను స్మగర్లు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మత్తు పదార్ధాలను వీరికి జోరుగా అమ్ముతూ ఈ చీకటి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తున్నారు. కళాశాలలో చదువుతున్న యువతను, కార్ఖానాల్లో పనిచేస్తున్న యువతకు మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ దానికి బానిసలుగా మార్చే కొన్ని ముఠాలు నగరంలో సంచరిస్తున్నట్లు సమాచారం.
గంజాయి ముఠా వెనుక..
నల్లమల ప్రాంతంలో గత రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన ఒక ముఠా గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తూ ఏడు మంది పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారని సమాచారం. పట్టుబడిన ముఠా వెనక కొంతమంది బడా వ్యక్తులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి వివరాలు బయటపడకుండా ఒక కుట్ర జరిగిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పట్టుబడిన ముఠాలో అందరూ కూడా 18 నుండి 25 సంవత్సరాల లోపు వారే. వారంతా ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. నల్లమల నుండి గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన ముఠా వెనకాల ఎవరు ఉన్నారనే రహస్యాన్ని బహిర్గతం చేసేందుకు పోలీసులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.
వేలల్లో కొని లక్షల్లో అమ్ముతూ..
నల్లమల ప్రాంతంలో ఒక కేజీ గంజాయికి రూ. 3 నుండి 5 వేల లోపు కొనుగోలు చేసి హైదరాబాదులో కిలో గంజాయిని రూ.30 నుండి 50 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. మూడో చేతికి అందే క్రమంలో కిలో గంజాయి విలువ రూ.లక్షల్లో ధర పలుకుతుంది. గత కొంతకాలంగా నల్లమల ప్రాంతం నుండి గంజాయి సరఫరా చేస్తూ మధ్యవర్తులు రూ.వేలల్లో సంపాదిస్తే.. అసలు ముఠా వ్యక్తులు యువతను ప్రధానంగా టార్గెట్ చేసుకొని రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు.
జల్సాలకు బానిసవుతున్న ఉన్నత వర్గం యువకులు?
మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉన్నత వర్గానికి చెందిన యువతే ఎక్కువగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అధిక సంపాదన ఉండటం మూలంగానే వారి పిల్లలు అడ్డూ అదుపు లేకుండా చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. ఉన్నత చదువుల కోసం రాజధానికి చేరుకుంటున్న యువత ప్రధానంగా మత్తు పదార్థాలకు బానిసవుతుండటం ఆందోళన కలిగించే అంశం. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతం అమ్రాబాద్ పదర మండలాలలో బుధవారం అక్రమంగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన ఏడు మంది యువకులు 25 సంవత్సరాల లోపువారే. వీరిలో ముగ్గురు స్థానికులు కావడం విశేషం. అందులో నలుగురు వ్యక్తుల ముఠా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. తప్పించుకున్న ఇద్దరు వ్యక్తుల కుటుంబ నేపథ్యం సమాజంలో బాగా పేరు పలుకుబడి కలిగినవారు అని తెలుస్తోంది.
నిఘా పెంచాలి..
నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేయడంతో పాటు స్థానికులకు డబ్బు ఆశచూపి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ముఠా నాయకులు. వారిపై పోలీసు యంత్రాంగం మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అమ్రాబాద్ పోలీసులకు అందిన విశ్వశనీయ సమాచారం మేరకు తనిఖీ చేయగా బుధవారం వేర్వేరు చోట్ల ఏడుగురు యువకులు పట్టుబడి జైలు పాలయ్యారు. కావున నల్లమల ప్రాంతంలో పటిష్టమైన నిఘా ఉంచి గంజాయి సరఫరా జరగకుండా అడ్డుకోవాలి. అంతేకాకుండా యువత గంజాయికి బానిస అవకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం గంజాయి సరఫరా దారులతో పాటు తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించే ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజానీకం కోరుతోంది.