కాకతీయుల కళా నిలయం.. @కోటగుళ్ల

by Shyam |
Ganapuram kotaGulla
X

దిశ, చిట్యాల: కాకతీయుల కళా నిలయంగా గుర్తింపు పొందిన ఘనపురం కోట గుళ్లకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేశ్ రాయుడు ప్రభుత్వాన్ని కోరారు. భూపాలపల్లి జిల్లాలోని ప్రాచీన శిలాయుగపు చిత్రకళకు ప్రసిద్ధి చెందిన పాండవుల గుట్ట, ఘనపురం కోట గుళ్లను ఆదివారం ఆయన సందర్శించారు. ఆయనకు ఆయా ప్రాంతాల చారిత్రక విశేషాలను ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో ఈమని శివనాగిరెడ్డి వివరించారు. కాకతీయ గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడి కుమారుడు గణపతిరెడ్డి 1254లో నిర్మాణం చేసిన గణపేశ్వరాలయాన్ని పరిశీలించారు.

శిథిలస్థితిలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ చేసి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రామప్పకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లయితే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలక్ష్మి సంస్థల చైర్మన్ యార్లగడ్డ హరీశ్ చంద్ర ప్రసాద్, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి చైర్ పర్సన్ డాక్టర్ తేజస్విని యార్లగడ్డ, ప్రెసిడెంట్ ఉమా, అక్కినేని శారద, జాహ్నవి దేవిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story