గణపతి లొంగుబాటు.. కల్పితమే!

by Shyam |
గణపతి లొంగుబాటు.. కల్పితమే!
X

మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి గణపతితోపాటు మరికొందరు సెంట్రల్ కమిటీ సభ్యులు ప్రభుత్వం ముందు లొంగిపోతున్నట్లు వచ్చిన వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని ఆ పార్టీ పేర్కొంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు దురుద్దేశపూర్వకంగా సంయుక్తంగా ఆడిన డ్రామా అని మండిపడింది. కట్టుకథలతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే దుర్మార్గపు ఎత్తుగడ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ తన రెండు పేజీల ప్రకటనలో స్పష్టం చేశారు.

దిశ, న్యూస్ బ్యూరో:

గణపతి లొంగిపోతున్నాడంటూ ప్రజలను వాస్తవిక సమస్యల నుంచి తప్పుదారి పట్టించడానికి ఒక పథకం ప్రకారం సాగించిన దుష్ప్రచారమే తప్ప మరోకటి కాదని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. గణపతి లేదా కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి కట్టుకథల ద్వారా పార్టీ ప్రతిష్టను దిగజార్చవచ్చని పాలకవర్గాలు భావిస్తున్నాయని, ప్రజల్లో మావోయిస్టు పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని అనుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంతో అనుభవం కలిగిన, నిస్వార్థమైన సైద్ధాంతికంగా పట్టు కలిగిన, రాజకీయంగా నిబద్ధత కలిగిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వంలో ఉద్యమం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే పోతుందని వివరించారు. అంతిమ విజయం తథ్యమని అన్నారు. ప్రభుత్వాల దుర్మార్గమైన కుట్రలను ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు. ఇలాంటి చౌకబారు ప్రచారంతో, మీడియా ద్వారా నమ్మించే ప్రయత్నంలో ప్రభుత్వాలు మరింత దిగజారా యని, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయని పేర్కొన్నారు.

చిన్నచిన్న అనారోగ్య సమస్యలే..

గణపతికి వృద్ధాప్య సమస్య, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాస్తవమేనని, ఆ కారణంగానే ఆయన స్వచ్ఛందంగా కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకుని ఇతరులకు అప్పగించారని అభయ్ గుర్తు చేశారు. పోరాట సంస్థలలో ఇలాంటి మార్పులు సహజమేనని, ప్రపంచ చరిత్రలోని ఉద్యమ పార్టీల్లో ఇలాంటి అనేక ఉదాహరణలు కనిపిస్తాయని అన్నారు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం దృఢంగా, పటిష్టంగా ఉందని, పాలకవర్గాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయని, కార్పొరేట్ శక్తుల్లో నమ్మకాన్ని పెంచడానికి ఇలాంటి కుట్రలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నా యని ఆరోపించారు. దేశంలో 2022 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని కార్పొరేట్ శక్తులను నమ్మించేందుకు, ‘ఆపరేషన్ సమాధాన్’ ద్వారా ఉద్యమంపైనా, ప్రజలపైనా దాడిని, నిర్బంధాన్ని ఉధృతం చేశారన్నారు. తెలంగాణ సహా అనేక ప్రాంతాల్లో పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాలు బలపడుతున్నాయన్నారు.

కరోనా పరిస్థితుల్లో సాయుధ పోరాట సంస్థలతో కాల్పుల విరమణను ప్రకటించి ఐక్యంగా కొవిడ్-19ను ఎదుర్కోవాలని ఐక్యరాజ్య సమితి చేసిన విజ్ఞప్తిని మోడీ ప్రభుత్వం ఖాతరు చేయలేదన్నారు. ఇలాంటి కీలక సమయాల్లోనూ అత్యంత రాక్షసంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీపై మిలిటరీ క్యాంపెయిన్లు కొనసాగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కల్యాణ్ యోజన అనే అసలైన పథకాన్ని అమలుచేయడంలో భాగంగానే వరవరరావు, సాయిబాబా, ఆనంద్ టెల్టుంబ్డే, సుధా భరద్వాజ్, వెర్నెన్ గొంజాల్వేస్, రోణా విల్సన్, సురేందర్ గాడ్లింగ్, షోమా సేన్, గౌతమ్ నవలాఖా తదితరులను జైళ్ళలో నిర్బంధించిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

ముందుగా అప్రమత్తం చేసినా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా గురించి ముందుగానే అప్రమత్తం చేసినా, ట్రంప్ సేవలో మునిగిపోయిన మోడీ మార్చి నెలలో అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించారని, ఫలితంగా పేదలు అవస్థలు పడ్డారని అభయ్ మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనపు అంచులకు చేరిందని, సరిగ్గా ఇదే సమయంలో దేశ సహజ వనరులను, సంపదను దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి సర్కారు ప్రయత్నించిందని వివరించారు. ఈ పన్నాగానికి ముందే ప్రశ్నించే గొంతుకలను, సామాజిక శక్తులను కల్పిత కేసులతో జైళ్ళలో నిర్బంధించిందన్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నట్లు గ్రహించి పక్కదారి పట్టించడానికి, దేశభక్తిని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగమే చైనా యాప్‌లను నిషేధించడం, గూగుల్, రిలయెన్స్ లాంటి శక్తులకు మార్కెట్‌ను అప్పగించడం అని ఆరోపించారు.

గణపతి, కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు ప్రచారం వెనక అనేక కారణాలు, దురుద్దేశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయని, అందులో భాగమే ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేయడం అని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సమాధాన్’ను తట్టుకుని నిలబడి తెలంగాణ లాంటి ప్రాంతాలకు విస్తరిస్తున్న మావోయిస్టు పార్టీ తన సైద్ధాంతిక బలం, రాజకీయ నిబద్ధత, కేంద్ర కమిటీ పటిష్ట నాయకత్వం, ప్రజల మద్దతుతో పాలకవర్గాల విషదాడిని తిప్పికొడతామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story