రెండు మూడురోజుల్లో కేంద్రం నుంచి రెండో ప్యాకేజీ!

by Harish |
రెండు మూడురోజుల్లో కేంద్రం నుంచి రెండో ప్యాకేజీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం మరో రెండు, మూడు రోజుల్లో ఉద్దీపన పథకాన్ని ప్రకటిస్తుందని, ఎమ్ఎస్ఎమ్ఈ, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితులు సానుకూలంగా లేవని, ప్రభుత్వ పరిమితులనూ అర్థం చేసుకోవాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు. జపాన్, అమెరికా‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇండియా కన్నా ఎంతో పెద్దవని, అందుకే ఆయా దేశాలు భారీ ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించగలిగాయని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరినీ రక్షించేందుకు తాము శక్తి మేరకు కృషి చేస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తొలగించడానికి కేంద్రం రూ. 1.7 లక్షల కోట్లతో ఉద్దీపనను, రిజర్వ్ బ్యాంక్ 3 నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే, తెలంగాణలోని పారిశ్రామికవేత్తలతో గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో.. జీఎస్టీ, ఆదాయపన్ను రీఫండ్‌లను వీలైనంత త్వరగా లబ్దిదారుల అకౌంట్లకు బదిలీ చేయడానికి ప్రక్రియలను అన్వేషించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించినట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇచ్చిన సలహాలను ఆర్థిక మంత్రి, ప్రధానితో చర్చించినట్టు స్పష్టం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్దీపన ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్టు గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed