ఆర్టీసీ ఉద్యోగులకు ఫుల్ జీతాలు

by Shyam |
ఆర్టీసీ ఉద్యోగులకు ఫుల్ జీతాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి జీతాలు గురువారం సంస్థ చెల్లించింది. జూన్ నెల పనిచేసినందుకు గాను ఈ వేతనాలను సంస్థ ఉద్యోగుల ఖాతాల్లో వేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి 23నుంచి ఆర్టీసీ కార్మికులకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాల్లో సగం మాత్రమే సంస్థ ఇచ్చింది. ఏప్రిల్ నుంచి మూడు నెలలపాటు తెలంగాణలో తన ఉద్యోగులకు సగం వేతనాలే చెల్లించిన ప్రభుత్వం జూలైలో వేతనాలను మాత్రం పూర్తిస్థాయిలో ఇచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ కూడా ప్రభుత్వం బాటలోనే తమ ఉద్యోగులకు పూర్తి జీతాలివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి నెల స్థూలంగా ఆర్టీసీ తన ఉద్యోగులకు ఇచ్చే జీతం బిల్లు రూ.160 కోట్లు ఉండగా, కార్మికుల చేతికి వచ్చే నికర జీతం రూ.120 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లో భాగంగా జనతా కర్ఫ్యూ జరిగిన మార్చి 22నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు లాక్‌డౌన్ సడలింపులపై కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మే నెల 28వ తేదీ నుంచి పాక్షికంగా రోడ్డెక్కాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ పూర్తి జీతాలు

రాష్ట్రంలో నెలన్నర పాటు అమలులో ఉన్న పూర్తిస్థాయి లాక్‌డౌన్ తర్వాత జిల్లాల్లో బస్సులు ప్రారంభమైనప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్నందున గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం బస్సులు నడపడానికి ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతివ్వలేదు. అయినా ఇక్కడ పనిచేసే సంస్థ ఉద్యోగులకు కూడా యాజమాన్యం ఈనెల పూర్తి వేతనాలు చెల్లించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి జీతాలిచ్చారు సరే.. ఆలస్యం మాటేమిటి: థామస్ రెడ్డి

కరోనా పరిస్థితుల్లో జూన్ నెల వేతనం పూర్తిగా చెల్లించామని ఆర్టీసీ యాజమాన్యం గొప్పగా చెప్పుకుంటోందని, గతంలో ప్రతినెల ఒకటో తేదీన ఇచ్చే జీతాలు మెల్ల మెల్లగా 4 ఆ తర్వాత 5 ప్రస్తుతం 9వ తేదీకి చేరుకుందని ఇది సరైన పద్ధతి కాదని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) అగ్రనేత థామస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు జీతాలు చెల్లించడం కరక్టు కాదని, ఈ పద్ధతి మార్చుకోవాలని యాజమాన్యానికి ఆయన హితవు పలికారు. ఆలస్యంగా జీతాలు చెల్లించడం కారణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వివిధ రకాల రుణాలు తీసుకున్న కార్మికులు వాయిదా చెల్లించాల్సిన తేదీన చెల్లించకపోవడంలో పెనాల్టీలు, అధిక వడ్డీల బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సంస్థ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక ముందు ఒకటో తేదీన కచ్చితంగా జీతాలు కార్మికుల ఖాతాల్లో వేయాలని లేదంటే యాజమాన్యం కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని థామస్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story