బోడ కాకరకు ఫుల్ డిమాండ్.. స్పెషలేంటంటే..?

by Anukaran |
బోడ కాకరకు ఫుల్ డిమాండ్.. స్పెషలేంటంటే..?
X

దిశ, కాటారం: అడవి కాకర కూరను ఇష్టపడని వారుండరు. అయితే దీంట్లోనూ హైబ్రిడ్ రకాలు వస్తున్నా అడవి కాకరకు మాత్రం డిమాండ్ తగ్గట్లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో సహజ సిద్ధంగా పండించిన కూరగాయల వైపే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇమ్యునిటీ పవర్ పెంచుకోవడానికి సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో లభ్యమవుతున్న వాటిలో బోడ కాకరకాయకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం సీజన్‌లో లభ్యమయ్యే బోడకాకరకు ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయరు కాబట్టి డిమాండ్ పెరుగుతోంది. అంతేకాకుండా వీటిని అడవిలో సేకరిస్తూ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు.

అడవుల్లో లభ్యం..!

బోడ కాకర మొక్కలు అడవుల్లో వర్షా కాలం తొలకరి జల్లులకు మొలకలు వచ్చి, ఏపుగా పెరుగుతాయి. జూలై మొదటి వారం నుంచి కాత దశకు వస్తాయి. అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన బోడ కాకర గిరిజనులకు ఉపాధి నిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో అడవులు విస్తరించి ఉండడంతో బోడకాకర కాయలు విరివిగా లభిస్తాయి. గిరిజనులు ఉదయాన్నే అడవికి వెళ్లి సేకరిస్తారు. కాటారం సబ్​ డివిజన్​ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మహా దేవ్​పూర్​, పలిమెల, మల్హర్​ మండలాల్లోని అడవుల్లో దొరికే కాకరకాయలు సేకరించి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. బోడకాకరను నేరుగా వండుకున్నా.. మాంసంలో కలిపి వండుకుని తిన్నా భలే రుచిగా ఉంటుంది. సిటీల్లో అరుదుగా దొరకడంతో పట్టణ వాసులు ఎంతో ఇష్ట పడతారు. ధర ఎంతైనా కొనేందుకు వెనకాడరు.

కిలో రూ. 250 వరకు..

గిరిజనులు అటవీ ప్రాంతంలో సేకరించిన బోడకాకరకాయలను కిలో రేటు రూ. 150 నుంచి రూ. 250 వరకు అమ్ముతున్నారు. పట్టణ వాసులు గ్రామానికి వచ్చి కొంటే కిలో రేటు రూ. 120 లోపే ఇస్తారు. అయితే గ్రామాలకు వ్యాపారులు వెళ్లి గిరిజనుల వద్ద కొని పట్టణ ప్రాంతాలకు తరలించి ఎక్కువ రేటుకు అమ్ముతారు. దీంతో బోడకాకరకాయకు రేటు మరింత పెరిగింది. అటవీ గ్రామాల్లో కొని జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని పలు పట్టణ ప్రాంతాలకు వెళ్లి అమ్ముకుంటారు. పట్టణ ప్రాంతాల్లో బోడ కాకరకాయ కిలోకు రూ. 350 వరకూ ధర పలుకుతోంది.

ఈ సారి బాగానే కాసినయ్: మడయ్య, గిరిజనుడు మద్దిమడుగు

ఈ ఏడాది వర్షాలు ముందు​గా పడడంతో బోడకాకర మొక్కలు తొందరగా పెరిగి బాగానే కాశాయి. దీంతో అడవుల్లో కాయలు ఎక్కు వగా దొరుకుతున్నయి. వర్షం వస్తే ఆ రోజు అడవికి వెళ్లం. ఏటా బోడకాకరతో ఉపాధి పొందుతు న్నం. రోజు ఒక్కో ప్రాంతానికి పోతం. రోజు దొరకవు. దొరికిన కాయలను మా దగ్గరకు వచ్చి కొనుక్కున్న వాళ్లకు కిలోకు రూ. 120లోపే అమ్ముకుంటం.

Advertisement

Next Story

Most Viewed