భారత్‌లో రూ. 430 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ఫ్రెంచ్ సంస్థ!

by Harish |
egis
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మౌలిక సదుపాయాల, కన్సల్టింగ్ సేవల ఫ్రెంచ్ సంస్థ ఈజిస్ గ్రూప్ భారత్‌లో తమ ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. దీని కోసం రాబోయే ఐదేళ్లలో రూ. 430 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో అభివృద్ధి వేగవంతం చేయాలని భావిస్తున్న భారత ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగా ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ చిన్న సంస్థలను కొనుగోలు చేయడం, రైల్వే, నీటి నిర్వహణ రంగాల్లో తన పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేయడం ద్వారా ఉనికిని పెంచుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే ఈజిస్ సంస్థ గురుగ్రామ్‌లో అత్యాధునిక గ్లోబల్ డిజైన్ సెంటర్‌ను అభివృద్ధి చేసింది.

భారత్‌లో 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఈజిస్ కంపెనీ ఇప్పటివరకు రూ. 640 కోట్ల పెట్టుబడులను పెట్టింది. అంతేకాకుండా ఈజిస్‌కు ఫ్రాన్స్ వెలుపల అత్యధిక ఉద్యోగులను కలిగిన రెండో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇన్‌ఫ్రాపై దృష్టి సారించడంలో ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పైపుల ద్వారా నీటి సరఫరా, నిర్వహణ, కొత్త మెట్రో రైల్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల కోసం ఈజిస్ కంపెనీ ఈ ఏడాది 500 మందిని నియమించుకుంది. ‘భారత్‌లో పెరుగుతున్న ప్రాముఖ్యత, కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఇప్పటివరకు మా ఆర్డర్లు 108 శాతం పెరిగాయని’ ఈజిస్ గ్రూప్ సీఈఓ లారెంట్ జర్మైన్ అన్నారు.

Advertisement

Next Story