వీళ్లే అసలైన మానవతావాదులు.. భోజనం నుంచి వైద్యం వరకూ అంతా ఫ్రీ

by Anukaran |   ( Updated:2021-05-16 08:12:43.0  )
Covid Food2
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘పొరుగు వాడికి తోడుపడవోయ్​.. గట్టి మేల్​తలపెట్టవోయ్​’ అంటూ గురజాడ మాటలను చెవులతో కాకుండా మనసుతో విన్న మానవతా హృదయాలు ఈ సంక్లిష్ట సమయంలో స్పందిస్తున్నాయి. తమకు ఎలాంటి ముఖ పరిచయం లేని వారికోసం వారి చేతులు పని చేస్తున్నాయి. కరోనా వైరస్​వచ్చిందని సొంతవారే దూరంగా జరుగుతున్న ఈ రోజుల్లో తామున్నమంటూ గుండె ధైర్యం చెబుతూ అండగా నిలుస్తున్నారు. ఒంటరిగానో, సామూహికంగానో, సామాజిక సేవా సంస్థగానో తమ వల్ల ఏదైతే అది సాటి వారికి సాయమందిస్తూ వారి కష్టంలో పాలు పంచుకుంటున్నారు. భోజనం, వైద్యం, ఐసోలేషన్​సేవల ద్వారా మానసిక ధైర్యాన్ని పొందిన కొందరు కరోనాపై విజయం సాధిస్తు వస్తున్నారు. నగరంలో కొవిడ్​ పేషంట్లకు సాయమందిస్తున్న మానవతామూర్తులే ఈ సమయంలో నిజమైన హీరోలుగా నిలుస్తున్నారు.

కరోనా పాజిటివ్​లక్షణాలు కనిపించాయంటే చాలు.. కుటుంబ సభ్యులు కూడా దూరంగా జరుగుతున్నారు. కొవిడ్​ నిర్థారణ అయిందంటేనే మానసికంగా కుంగిపోతున్నవారు కూడా ఉన్నారు. పౌష్టికాహారం తీసుకునేందుకు ఇబ్బందులున్నవారు, అద్దె ఇండ్లల్లో, ఒకే గదిలో కుంటుంబంలో ఉంటున్నవారిలో ఒకరికి కరోనా వచ్చినా కష్టంగా మారుతున్న రోజులు. పాజిటివ్​వచ్చిందంటే.. హోం ఐసోలేషన్ లో ఉండలేని కుటుంబాలు అనేకం. వైరస్ ప్రభావం నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రత్యేకమైన ఫుడ్​ తీసుకునేందుకు ఆర్థిక భారాన్ని భరించలేని పరిస్థితి మరికొందరిది. ఇలాంటి పరిస్థితుల్లో తామున్నమంటూ ముందుకు వస్తున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు, సాటివారికి సాయంగా నిలవాలనుకునే మానవతా హృదయాలు. ఈ జాబితాలో ప్రముఖులు, ఎన్జీఓలు, రాజకీయ నాయకులు, పార్టీలు, సామాజిక సంస్థలు, ఒంటరిగా సాయం చేసేవారు కూడా ఉన్నారు.

Food2

అద్దె, ఇరుకు ఇండ్లల్లో ఉండే వారి కోసం హోం ఐసోలేషన్​సెంటర్లను స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అనేకం అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్నిటిని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. తమ ఆర్థిక సామర్థ్యం, ఇతరుల సహకారం అవకాశాలను బట్టి ఒక్కో సెంటర్ లో 20 – 50 బెడ్స్ ఉండేలా నిర్వాహకులు చూస్తున్నారు. కొన్నిటిలో ఆక్సిజన్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఐసోలేషన్​ కేంద్రాల్లో ఉచితంగా మూడు పూటల భోజనం, స్నాక్స్, టీ వంటి వాటిని అందిస్తున్నారు. ఐసోలేషన్​ కేంద్రాల్లో ఉండేవారి కోసం ఎంటర్​ టైన్​మెంట్ ప్రోగ్రాంలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైఎంసీఏ, యూనీ కార్పస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్​లో 50 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

తెల్లరేషన్ కార్డు ఉన్నవారేవరైనా ఇందులో ఉండవచ్చు. అత్యవసర చికిత్స అవసరమైతే అందుకోసం ఐసీయూ రూమ్​ని కూడా సిద్ధం చేశారు. ‘ టీమ్ వర్క్ ’ స్వచ్ఛంద సంస్థ సిటీలోని నాలుగు లోకేషన్లలో ఐసోలేషన్​సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో రెండొందలకు పైగాబెడ్స్ అందుబాటులో ఉంచింది. గచ్చిబౌలిలో 50 బెడ్స్ ఉండగా, కొండాపూర్, జూబ్లీహిల్స్​ప్రాంతాల్లో మిగతా సెంటర్లు ఉన్నాయి. వీటిలో మూడు పూటలా భోజనంతో పాటు మెడిసిన్స్, ఆక్సిజన్​అందిస్తోంది. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 25 బెడ్స్ తో ఐసోలేషన్​ కేంద్రాన్ని సీపీఎం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉండే వారి కోసం మినీ ప్రొజెక్టర్ థియేటర్ ను కూడా నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. నగర వ్యాప్తంగా ఇరవైకి పైగా ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Covid Food

ఐసోలేషన్​ కేంద్రాలతో పాటు కొవిడ్ పేషంట్లకు, వలస కూలీలకు, పేదలకు అన్నం పెట్టేందుకు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వ్యక్తిగతంగా ఆహారాన్ని అందించేవారే కాకుండా రోజూ వందల సంఖ్యలో భోజనాలు అందిస్తున్నవారు కూడా ఉన్నారు. లాక్​డౌన్ సమయంలో పేదలను ఆదుకునేందుకు స్థాపించిన రైస్ ఏటీఎం నిర్వాహకులు ఇప్పుడు భోజనాన్ని అవసరమున్న వారు ఉండే చోటుకే వెళ్లి అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోని పేషంట్ బంధువులతో పాటు వలస కార్మికులు కూడా వీరి సేవలను పొందుతున్న వారిలో ఉన్నారు.

ఇక హోం ఐసోలేషన్ లో ఉండే వారికి పోన్​ చేస్తే ఇంటికే వెళ్లి భోజనాలు అందించే సంస్థలు అనేకం సిటీలో పనిచేస్తున్నాయి. కొందరు రెండు పూటలా భోజనం అందిస్తుండగా.. ధనలక్ష్మి ట్రస్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒకే పూట భోజనం అందిస్తున్నారు. కూకట్ పల్లి, మియాపూర్ ఏరియాల్లో ఫుడ్ డెలివరీ అందించే సామాజిక కార్యకర్త నిహారికా రెడ్డి కేవలం వెజేటేరియన్​ఫుడ్ మాత్రమే అందిస్తున్నారు. ఇలా పేషంట్ల ఆహారపు అలవాట్లను బట్టి కూడా సేవలందిస్తున్నవారు సిటీ వ్యాప్తంగా ఉన్నారు.

Food

Advertisement

Next Story