కేసీఆర్ ఫ్యామిలీకి ఆ ఒక్క వెలితీ తీరింది!

by Shyam |
కేసీఆర్ ఫ్యామిలీకి ఆ ఒక్క వెలితీ తీరింది!
X

దిశ, న్యూస్‌బ్యూరో: నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా మాజీ ఎంపి కవిత పేరు ఖరారైంది. గత ఐదేళ్ళ పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్న ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆ కుటుంబంలోనివారు ఇప్పటికే అన్ని చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన చరిత్ర నమోదైంది. ఇప్పటిదాకా శాసనమండలిలో ఆ కుటుంబం తరఫున ఒక్కరు కూడా సభ్యులు కాలేదు. ఇప్పుడు ఆ వెలితి కూడా తీరినట్లవుతోంది. ఢిల్లీ మొదలు రాష్ట్రం వరకు అన్ని చట్టసభల్లో ఆ కుటుంబానికి చెందినవారు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటికీ కొద్దిమంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఎమ్మెల్సీగా మాత్రం ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి ఎవ్వరూ లేరు. మొదటిసారిగా కవిత ఆ కొరతను తీరుస్తున్నారు.

ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గతంలో లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగానూ ఉన్నారు. ఆయనకు సన్నిహిత బంధువు సంతోష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కుమారుడు కేటీఆర్ క్యాబినెట్ మంత్రిగా (సిరిసిల్ల ఎమ్మెల్యే) ఉన్నారు. మేనల్లుడు కూడా మంత్రిగా ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆ కుటుంబానికి ప్రాతినిధ్యం ఉన్నట్లయింది. కేసీఆర్ కుటుంబం నుంచి తొలిసారి శాసనమండలిలోకి అడుగుపెడుతున్న వ్యక్తి కవిత అవుతారు. దీంతో అన్ని చట్టసభల్లో ఆ కుటుంబానికి ప్రాతినిధ్యం ఉన్నట్లయింది.

నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడాన్ని తగ్గించిన కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో తగిన ప్రోటోకాల్‌తో తిరగడానికి వీలవుతుంది. జిల్లాలో రాజకీయంగా ఆధిపత్యం వహించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఆ జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కవిత రాకతో జిల్లా రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగి అవకాశముంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌గా ఉండింది. కానీ, ఇప్పుడు దానికి తెర దించినట్లయింది. ప్రస్తుతం లోక్‌సభలో మినహా అన్ని చట్టసభల్లోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఉన్నారు.

tags : Telangana, KCR, Family, Kavitha, Nizamabad, MLC

Advertisement

Next Story

Most Viewed