రెండుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు సన్యాసి.. ఎవరో తెలుసా?

by Anukaran |
Former MLA Dr. V. Sivaramakrishna Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు. అద్భుతమైన సంపాదనతో జీవితాంతం హాయిగా గడిపేయవచ్చు. వారసులను ఎలాగైనా వ్యాపారాల్లో, కలిసొస్తే రాజకీయాల్లోకే దింపి హాయిగా మాజీ ఎమ్మెల్యేగా ఫింఛన్, ఇంతో అంతో ఫైరవీలతోనైనా వెళ్లదీయవచ్చు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు చాలాసార్లు గెలిచినా ఇంకా పింఛన్ కోసమే ఎదురుచూసేవారున్నారు. అలాంటి వారిది వేరే సంగతి. వెళ్లమీద అక్కడక్కడ కనిపిస్తారు. కానీ ఇక్కడ కనిపించే ఓ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా సన్యాసం స్వీకరించాడు. జీవితం మీద విరక్తి చెందో లేక రాజకీయాలంటే నచ్చకో ఏమో కానీ జీవితాన్ని మాత్రం సన్యాసానికి సమర్పించుకున్నాడు.

V. Sivaramakrishna Rao

కడప(వైఎస్ఆర్ కడప) జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.శివరామకృష్ణారావు 1978లో జేఎన్‌పీ నుంచి, 1989లో కాంగ్రెస్​ నుంచి గెలిచారు. మొదటిసారి 44 వేల మెజార్టీతో, రెండోసారి 60 వేల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా 1972లో, 1983లో, 1985లో, 1994లో, 1999లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చివరిసారిగా 2001 ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో కాంగ్రెస్​ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి విజయమ్మ చేతిలో 58 వేల ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. కానీ ఇప్పుడు కారణాలు చెప్పకుండానే ఆయన సన్యాసం స్వీకరించారు. సన్యాసిగా కనిపిస్తున్న ఆయన ఫొటో ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గెలిచి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పొలిటికల్ లీడర్ ఏకంగా సన్యాసం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed