- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుమ్మల మౌనానికి అర్థం ఏంటీ..?
దిశ ప్రతినిధి, ఖమ్మం : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బీజేపీలోకి వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఆయన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై అభిమానులు, అనుచరుల్లో జిల్లా రాజకీయ వర్గాలు, వ్యాపార వర్గాలు, సామాన్య జనం మధ్య ఒకటే చర్చ జరుగుతుండటం విశేషం. ఎక్కడ నలుగురు గుమిగూడిన తుమ్మల రాజకీయం.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆహ్వానం.. ఆశీర్వాదం వంటి అంశాలపైనే ముచ్చటించుకుంటుండటం గమనార్హం. తుమ్మల రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనే విషయంపై మూడు రోజులుగా మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ విషయాలపై తుమ్మల గాని, ఆయన వర్గం నుంచి క్లారిటీ ఇవ్వడం లేదు. మౌనమే సమాధానమవుతోంది. బీజేపీలోకి వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలను మాజీమంత్రి ఖండిచకపోవడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
తుమ్మలకు కేసీఆర్ ఫోన్..
నాలుగు రోజుల క్రితం వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తుమ్మల స్వగృహనికి వెళ్లారు. ఈ సందర్భంగా తుమ్మలకు అజయ్‌కుమార్ పాదాభివందనం కూడా చేశారు. అనంతరం పువ్వాడ అజయ్‌కుమార్ సొంత నిధులతో తన అన్న స్మారకార్థం రఘునాథపాలెంలో నిర్మించిన రైతు వేదిక ప్రారంభానికి తుమ్మలను తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా రైతు వేదిక ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి తుమ్మల ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అజయ్ ఎంతో చనువుగా కలివిడిగా వ్యవహరించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న తుమ్మల వద్దకు ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత జరిగిన పరిణామంతో అనేక ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్లయింది. తుమ్మలకు బీజేపీ నుంచి ఆఫర్ ఉందనే వార్తల నేపథ్యంలోనే స్వయంగా ముఖ్యమంత్రి సూచనల మేరకే ఇద్దరు మంత్రులు తుమ్మలకు ఇంటికి వెళ్లినట్లుగా ఆయన అభిమానులు చెబుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తుమ్మలకు ఫోన్ చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా సూచించడం వల్లే రైతు వేదిక ప్రారంభోత్సవానికి తుమ్మల వెళ్లినట్లుగా చెబుతున్నారు. మరోవైపు తుమ్మలకు కేంద్ర మంత్రివర్గంలోని ఓ కీలక నేత టచ్‌లో ఉండి…రాజ్యసభ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర బాధ్యతల్లో కూడా కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తుమ్మలను ఊరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాగ్రత్త పడ్డారన్నది టీఆర్ఎస్‌లోని కొంతమంది అభిప్రాయం.
వ్యూహాత్మక ధోరణితో తుమ్మల..?
పార్టీ మార్పుపై వినిపిస్తున్న వార్తలను ఖండించకుండా కావాలనే తుమ్మల వ్యూహాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారని కొంతమంది రాజకీయ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత ప్రతిస్పందన.. బీజేపీ అధిష్ఠానం నుంచి హామీలను తెలుసుకునేందుకే తుమ్మల ఆచితూచి.. వేచి చూసి అనే ధోరణిని అవలంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడు రోజులుగా ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల అంశం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మార్పు వల్ల జిల్లా రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలు చోటుచేసుకోనున్నాయనే దానిపైన చర్చ జరుగుతోంది. పార్టీలో తుమ్మల ఆక్టివ్ అయితే ఎలా ఉండబోతోంది.. పార్టీ మారితే జిల్లా రాజకీయాలు ఉండబోతున్నాయనే అంశాలను భిన్న వర్గాలప్రజలు విశ్లేషిస్తున్నారు.
తుమ్మల వర్గంలో ఆనందం…
ఏది ఏమైనా తమ నాయకుడు ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యే టైం వచ్చిందంటూ తుమ్మల అనుచరులు, అభిమానులు, ఆయన వర్గం టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తుమ్మల పుట్టిన రోజు కావడంతో ఈ సంతోషం రెట్టింపు అయ్యింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా మాజీమంత్రిని అభిమానులు, కార్యకర్తలు వచ్చి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. మమ్మల్ని సంతోషపెట్టేలా రాజకీయ భవిష్యత్ ఉండాలని కొంతమంది సన్నిహితులు తుమ్మలతో అనడం విశేషం. తుమ్మల తన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.