కాసేపట్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

by Shyam |   ( Updated:2020-11-25 02:00:35.0  )
కాసేపట్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేయగా ఇప్పుడు బీజేపీ సిద్ధమవుతోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా గురువారం నగరంలో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. వరద సాయంతో పాటు ప్రజలకు పన్నుల భారాన్ని తగ్గించే వరాలు ఈ మేనిఫెస్టోలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ బాధిత కుటుంబానికి తలా రూ. 25వేల చొప్పున వరద సాయం అందిస్తామని, వరదల్లో బైక్‌లు, కార్లు పోయినవారికి కొత్తవి ఇస్తామని, ప్రజలపై చలాన్ల భారం లేకుండా జీహెచ్ఎంసీ తరఫునే కట్టిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లు చేసిన నేపథ్యంలో మేనిఫెస్టోలో ఇవి చోటుచేసుకుంటాయా లేవా అనేది తేలిపోనుంది.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా బీజేపీ మేనిఫెస్టోలో ఏముంటుందనేది నగర ప్రజలకు ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలూ ఉచిత వరాలు కురిపించిన నేపథ్యంలో బీజేపీ అదే తీరులో వరాలు కురిపిస్తుందా లేక అభివృద్ధి ప్రధాన అంశంగా మౌలిక సదుపాయాల కల్పన, శాశ్వత పరిష్కారం తదితరాలను ప్రస్తావిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు నగరానికి వస్తున్నా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed