‘పవన్ కళ్యాణ్’ మద్దతెవ్వరికీ..? బీజేపీకా..? టీఆర్ఎస్‌కా..?

by Anukaran |   ( Updated:2021-04-01 08:39:22.0  )
‘పవన్ కళ్యాణ్’ మద్దతెవ్వరికీ..? బీజేపీకా..? టీఆర్ఎస్‌కా..?
X

దిశ‌, తెలంగాణ బ్యూరో : సాగర్ ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం పెద్దగా లేకపోయిన ఆయన బై ఎలక్షన్స్ లో ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్దతిచ్చి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. వాస్తవానికి జనసేన రాజకీయంగా బీజేపీతో కలిసి పనిచేస్తోంది. రెండు పార్టీలు వివిధ సందర్భాల్లో పరస్పరం సమన్వయంతో పని చేశాయి.

బీజేపీ కేంద్ర నాయకత్వం సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్(సీఏఏ)ను అమలు చేస్తామని చెప్పినప్పుడు దేశంలోని అనేక పార్టీలు కమలనాథులపై విమర్శలు గుప్పించినా.. పవన్ మాత్రం ఆ పార్టీకి బహిరంగగానే మద్దతు పలికారు. ప్రజల వద్దకు వెళ్లి సీఏఏ వల్ల జరిగే దుష్పరిణామాలేం లేవంటూ నచ్చజేప్పారు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ బల్దియా కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పూర్తి మద్దతును అందించింది.

అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి ఆయన తన వైఖరిని మార్చుకున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీతో కలిసి పని చేస్తుంటే పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నాయకత్వం తనను సంప్రదించలేదని విమర్శంచారు. అందుకే ఆ పార్టీకి మద్దతివ్వబోమని టీఆర్ఎస్ అభ్యర్థులకు జనసైనికులు,అభిమానులు, ప్రజలు ఓట్లేయాలని పిలుపునిచ్చారు.

దీంతో పవన్ వైఖరిపై రాజకీయ వర్గాలు, ఆయన అభిమానుల్లో సైతం కన్ఫ్యూజన్ ఏర్పడింది. తెలంగాణలో జనసేన అంతగా బలంగా లేకున్న ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ యువతను ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అనుకున్నట్లే రెండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార టీఆర్ఎస్ గెలుచుకోవడంతో.. బీజేపీ కేంద్ర నాయకత్వం సాగర్ ఉప ఎన్నికల్లో పవన్ మద్దతు తీసుకోవాలని రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం.

అయితే బీజేపీతో రాజకీయంగా కలిసి పనిచేస్తోన్న పవన్ ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన టీఆర్ఎస్‌కు మరోసారి మద్దతు పలుకుతారా..? లేక బీజేపీకి సపోర్ట్ చేస్తారా..? అనే డిస్కషన్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పవన్ ఈ సారి ఎవరికి మద్దతు ప్రకటించినా.. అది ఆయన అభిమానుల్లో గందరగోళానికి కారమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పవన్ మరోసారి టీఆర్ఎస్‌కు మద్దతిస్తే.. బీజేపీ కేంద్ర నాయకత్వం నొచ్చుకోవచ్చని అంటున్నారు. తద్వారా ఏపీలోని బీజేపీ-జనసేన క్యాడర్‌లో గ్యాప్‌ను సృష్టించిన వారవుతారనే కాన్సెప్ట్‌లో ఉన్నారు.

అలా కాకుండా సాగర్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తే ఆయన ఏప్రిల్ ఫూల్ కావడం ఖాయమంటున్నారు. ఒకసారి బీజేపీ.. మరోసారి టీఆర్ఎస్ ఇలా తన స్టాండేంటో ఆయనకే స్పష్టత లేకపోతే క్యాడర్‌కు ఏం సందేశమిస్తారోననే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. అందుకే సాగర్ ఎన్నికల నేపథ్యంలో పవన్ ఈ సారి ఎలాంటీ ప్రకటన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story