స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్!

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాలతో సొంత గ్రామాల్లో స్కూళ్లు మూతపడటంతో పక్క గ్రామాలకు వెళ్లి చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా సైకిళ్లు లేదా నడక ద్వారా పాఠశాలలకు వెళ్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సహా ఇతర కారణాలతో కూడా స్కూల్ డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు అయ్యే ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2,243 గ్రామాల్లోని 21,964 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రాథమిక పాఠశాల లేని 458 గ్రామాల్లోని 4,226 మంది, ప్రాథమికోన్నత పాఠశాల లేని 1,910 గ్రామాల్లోని 17,738 మంది విద్యార్థులను గుర్తించారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ప్రతీ విద్యార్థిపై రవాణా చార్జీల కోసం ఏడాదికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మొత్తం విద్యార్థులపై ఏడాదికి రూ.13.17 కోట్లు ఖర్చు చేస్తోందని, విద్యాహక్కు-2009 చట్టం ప్రకారం ఈ సౌకర్యం కల్పిస్తున్నామని స్కూల్ ఎడ్యూకేషన్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ అధికారికంగా వెల్లడించారు.

Advertisement

Next Story