సాకర్‌లో ఇకపై ఐదుగురు సబ్‌స్టిట్యూట్స్

by Shyam |
సాకర్‌లో ఇకపై ఐదుగురు సబ్‌స్టిట్యూట్స్
X

దిశ, స్పోర్ట్స్: సాకర్ (ఫుట్‌బాల్)లో ఇకపై ఐదుగురు సబ్‌స్టిట్యూట్స్ బరిలోకి దిగొచ్చని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన దశలోనే ఉన్నా.. కరోనా ప్రభావం తగ్గి ఫుట్‌బాల్ సీజన్ మొదలయ్యే సమయానికి ఈ నిబంధనను అమలుల్లోకి తేవాలని ఫిఫా ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఫుట్‌బాల్ క్రీడలో ఆటగాళ్లు తరచూ గాయపడుతూ ఉంటారు. ఎక్కువ సమయం ఫీల్డ్‌లో ఉండటం వల్ల శక్తిని కూడా కోల్పోతుంటారు. వీటి నుంచి ఆటగాళ్లను రక్షించే ఉద్దేశంతో ఐదుగురు సబ్‌స్టిట్యూట్స్ నిబంధన అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి సరికొత్త ఫుట్‌బాల్ నియమావళిని రూపొందిస్తున్నారు.

మరో వారం రోజుల్లోనే ఈ నియమావళికి ఆమోదముద్ర లభించనుంది. కాగా, ఈ నిబంధన తాత్కాలికంగా అమల్లో ఉంటుందని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం బోర్డు (ఐఎఫ్ఏబీ) చెబుతోంది. ఈ ప్రతిపాదనపై ఈ రోజే (శుక్రవారం) ఐఎఫ్ఏబీ ఆమోదం తెలపనుంది. ప్రస్తుతం ఫుట్‌బాల్ క్రీడలో ముగ్గురు సబ్‌స్టిట్యూట్‌లకు మాత్రమే అనుమతి ఉంది. మ్యాచ్ అదనపు సమయంలోకి వెళ్తే నాలుగో సబ్‌ను అనుమతిస్తారు. మారిన నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో మూడు సార్లు గరిష్టంగా ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌లను వాడుకోవచ్చు. అదనపు సమయంలోకి మ్యాచ్ వెళితే ఆరో సబ్‌ను కూడా అనుమతించనున్నారు.

Tags: Football, Soccer, Substitute, Extra Time, New Terms, FIFA, IFAB

Advertisement

Next Story