సిద్దిపేటలో ఆహార భద్రత కమిషన్ సభ్యుల తనిఖీ

by Shyam |   ( Updated:2020-04-13 08:08:03.0  )
సిద్దిపేటలో ఆహార భద్రత కమిషన్ సభ్యుల తనిఖీ
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో లాక్ డౌన్ సందర్భంగా ఆహార భద్రత చట్టం ప్రకారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అందరికీ ఆహార ధాన్యాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఒరుగంటి ఆనంద్ తనిఖీలు చేశారు. తెలంగాణ ప్రజలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ అవుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దేవక్కపల్లి గ్రామంలో ఒరిస్సా నుంచి వలసొచ్చిన కూలీలను ఆరా తీయగా తమకు 12 కిలోల బియ్యం, రూ.500 నగదు వచ్చిందని వారు సమాధానమిచ్చినట్టు తెలిపారు. ఐదేండ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారా ప్రశ్నించగా ఇప్పటి వరకు ఎలాంటి పౌష్టికాహారం అందలేదని వారు చెప్పారు. దీంతో పిల్లలకు వెంటనే గుడ్లు, బాలామృతం అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్ వాడీ టీచర్‌ను విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీడీపీఓ జయమ్మను ఆదేశించారు. అలాగే మండలంలోని ప్రతి కుటుంబానికి ఆహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది రోజువారీ కూలీలు, పేద మహిళలు తమకు బియ్యం వచ్చాయి కానీ అవి కుటుంబానికి సరిపోవడం లేదని చెప్పారు. మరికొందరు రేషన్ కార్డులో తమ పేర్లు లేవని అందుకే తమకు బియ్యం ఇవ్వలేదని అధికారికి విన్నించారు. స్పందించిన కమిషన్ సభ్యులు వెంటనే వారికి బియ్యం పంపిణీ చేయాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో ఓబులేసు, సీడీపీఓ జయమ్మ , దేవక్కపల్లి సర్పంచ్ కరివేద విజయలక్ష్మి, మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రామకృష్ణ రెడ్డి , నాయకులు కనగండ్ల తిరుపతి, అధికారులు పాల్గొన్నారు.

tags ; corona, lockdown, food safety commission officers check

Advertisement

Next Story

Most Viewed