బ్యాడ్‌బ్యాంక్ ఇచ్చే రసీదులకు ప్రభుత్వం హామీ!

by Harish |
nirmala-seeta-raman 1
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకులకు సవాలుగా మారిన మొండి బకాయిల పరిష్కారం కోసం బ్యాడ్‌బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జాతీయ ఆస్తుల పునర్నిర్మాణం సంస్థ(ఎన్ఏఆర్‌సీఎల్) లేదా బ్యాడ్‌బ్యాంక్ ఇచ్చే మొత్తం రూ. 30,600 కోట్ల విలువైన రసీదులకు ప్రభుత్వం హామీ ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఐదేళ్ల వరకు కొనసాగే ఈ హామీ ప్రతిపాదించిన బ్యాడ్‌బ్యాంక్ 15 శాతం రుణాలను డబ్బు రూపంలో చెల్లిస్తుందని, మిగిలిన 85 శాతం ప్రభుత్వం హామీతో సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి వివరించారు.

ఇక, గడిచిన 6 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకు రూ. 5,01,479 కోట్లను రికవరీ చేశాయని, ఇందులో రూ. 3.1 లక్షల కోట్లను 2018 తర్వాతే రికవరీ జరిగిందన్నారు. ఏవైనా నిరర్ధక ఆస్తి(ఎన్‌పీఏ) కొనుగోలులో నష్టం ఏర్పడితే ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. కాగా, దేశీయంగా బ్యాంకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్‌పీఏల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పలు అధ్యయనాల ప్రకారం 2022 నాటికి బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏల విలువ ఏకంగా రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటాయనే హెచ్చరికలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌లో బ్యాడ్‌బ్యాంక్ ఏర్పాటును వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed