శాంతి చర్చలంటూనే బస్సును పేల్చిన మావోలు.. ఐదుగురు పోలీసులు మృతి

by Anukaran |
Naxals attack in Chhattisgarh
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానితో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఇటీవలే ప్రకటించిన మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. పోలీసులు ప్రయాణిస్తున్న ఒక బస్సును పేల్చివేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మరణించగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది ఈ ఘటన.

వివరాలిలా ఉన్నాయి. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో గల అటవీ ప్రాంతాల్లో సుమారు 90 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ) పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఆపరేషన్ ముగించుకుని నారాయణపూర్ తిరిగి వస్తుండగా.. 20 మంది పోలీసులతో కూడిన ఓ బస్సు కదేనార్-కన్హర్‌గావ్ మార్గంలోని బ్రిడ్జి వద్దకు చేరుకుంది. అంతకుముందే వంతెన కింద మందుపాతరను అమర్చిన మావోయిస్టులు.. బస్సు బ్రిడ్జి మీదకు రాగానే రిమోట్ సాయంతో దానిని పేల్చేశారు. దీంతో బస్సు 20 అడుగుల ఎత్తు ఎగిరి గింగిరాలు తిరిగి పక్కనే ఉన్న వాగులో పడింది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని నారాయణపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రభుత్వానితో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. పోలీసులు, భద్రతా దళాలు అడవుల్లో కూంబింగ్ చేపట్టడంపై ఆగ్రహంగా ఉన్న మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed