విష జ్వరాలతో ఐదుగురు మృతి.. కొత్తగూడెం జిల్లాలో టెన్షన్.!

by Sridhar Babu |   ( Updated:2021-08-31 10:07:56.0  )
విష జ్వరాలతో ఐదుగురు మృతి.. కొత్తగూడెం జిల్లాలో టెన్షన్.!
X

దిశ, ములకలపల్లి : విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాలతో పాటు మైదాన ప్రాంతంలో సైతం ప్రతీ ఇంట్లో జ్వర పీడితులున్నారు. నెల తిరగకుండానే విష జ్వరాలతో మండలంలో ఐదుగురు మృతి చెందారు. వరుస మరణాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

ప్రతీ ఇంటా జ్వరపీడితులే..

మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రస్తుతం ప్రతీ ఇంటా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. ఒక్కో ఇంటిలో ఇద్దరు, ముగ్గురు జ్వరంతో బాధపడుతున్నారు. పూర్తి ఏజెన్సీ మండలం కావడంతో వైద్యానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తున్నది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో లేదు. గుండాలపడు గిరిజనులు ఆసుపత్రికి రావాలంటే కనీసం 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు స్థానిక ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.

వేధిస్తున్న సిబ్బంది కొరత..

మంగపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నలుగురు స్టాఫ్ నర్సులు ఉండాల్సిన చోట.. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో నలుగురు హెల్త్ అసిస్టెంట్లు ఉండాలి కానీ, ప్రస్తుతం ఒక్కరు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇక్కడ పనిచేసే ఇద్దరు వైద్యులు స్థానికంగా నివాసం ఉండరు. దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు రోగులు తీవ్ర ఇబ్బందులకు గురై వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తున్నది.

రక్త పరీక్షలకు అవకాశం లేదు..

మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషియన్ మొన్నటివరకు కొత్తగూడెంలో కొవిడ్ టెస్టుల నిమిత్తం అక్కడ విధులు నిర్వహించారు. ఇటీవలే ఆయన్ను తిరిగి ములకలపల్లికి తీసుకు వచ్చినట్టు సమాచారం. మండలంలో ఎక్కువగా మలేరియా, డెంగ్యూ కేసులు వస్తుంటాయి.

అయితే.. ఆసుపత్రిలో మలేరియా, టైఫాయిడ్ వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన అన్ని పరీక్షలకు తెలంగాణ హబ్‌గా పిలువబడే కొత్తగూడెంకు రక్త నమూనాలను పంపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ కారణంగా ఒకటి, రెండు రోజుల సమయం తీసుకుంటే తప్ప వ్యాధి నిర్ధారణ కావడంలేదు. ఫలితంగా రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

రక్త పరీక్షల స్థాయి పెంచండి..

మంగపేట ఆసుపత్రిలో రక్త పరీక్షల కోసం సెల్ కౌంటర్ ఒకటి అవసరం ఉంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. ఇక్కడ డెంగ్యూ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో డెంగ్యూ పరీక్షల సౌకర్యం మండల కేంద్రంలో కల్పించాలి. కనీసం 20 కిట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటే కొంత నష్టం నివారించవచ్చు.

వరస మరణాలు..

మండల వ్యాప్తంగా ఆగస్టు నెలలో ఇప్పటివరకు ఐదుగురు జ్వర పీడితులు మృత్యువాత పడ్డారు. ఆగస్టు 2న మంగపేట గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మీ ప్రసన్న(8), ఆగస్టు 3న మొగరాలగుప్ప గ్రామానికి చెందిన రవ్వ వెంకటేష్(40), ఆగస్టు 26న మాధారం గ్రామానికి చెందిన కొట్టే అనూష(11), ఆగస్టు 31న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందటం మరింత స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అంబేద్కర్ నగర్‌కు చెందిన గంట అలివేలు(50), కమలాపురానికి చెందిన జక్క రామకృష్ణ(25) జ్వరంతో బాధపడుతూ మంగళవారం ప్రాణాలు విడిచారు.

Advertisement

Next Story

Most Viewed