వచ్చేనెల 5 నుంచి చేప పిల్లల పంపిణీ

by Shyam |
వచ్చేనెల 5 నుంచి చేప పిల్లల పంపిణీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో వచ్చేనెల 5నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్ కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 24వేల చెరువులు, రిజర్వాయర్లలో రూ. 50కోట్ల వ్యయంతో 81కోట్ల చేపపిల్లలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా 78నీటి వనరులలో రూ. 10కోట్ల వ్యయంతో 5కోట్ల రొయ్య పిల్లలు విడుదల చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేపపిల్లల విడుదల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో మత్స్యకారుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని, త్వరలోనే రెండో విడత గొర్రెలు, పాడి గేదెల పంపిణీ చేపడతామన్నారు. గొర్రెలు, పాడి గేదెలకు సంబంధించిన పెండింగ్ ఇన్సురెన్స్‌ను నెలరోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని, కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు. ఆగస్టు 1 నుండి వచ్చే ఏడాది మే వరకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. త్వరలోనే మెగా డైరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయ డెయిరీ లాభాల బాటలో పయనిస్తుందని, విక్రయాలు మరింతగా పెంచేందుకు పెద్ద ఎత్తున ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed