వైన్స్‌ డిపోలో ఫైర్ ఆక్సిడెంట్.. రూ. వందల కోట్ల మద్యం దగ్దం

by Aamani |
వైన్స్‌ డిపోలో ఫైర్ ఆక్సిడెంట్.. రూ. వందల కోట్ల మద్యం దగ్దం
X

దిశ, ఆదిలాబాద్: రూ. వందల కోట్ల మద్యం బాటిళ్లు అగ్ని ప్రమాదంలో దగ్దం అయిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఉట్నూర్ లిక్కర్ డిపోలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‎తో‌ ఈ ప్రమాదం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు మద్యం సరఫరా చేసేందుకు గతంలో ఉట్నూర్‌లో లిక్కర్ డిపో‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 114 వైన్ షాపులు, బార్లకు నిత్యం మద్యం సరఫరా చేస్తున్నారు. బుధవారం ఉదయం డిపోలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి పొగలు వ్యాపించాయి. రోజువారీగా విధులకు హాజరయ్యేందుకు వచ్చిన కూలీలు గమనించి అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి.

ఆదిలాబాద్, జన్నారం, ఇచ్చోడ అగ్నిమాపక కేంద్రాలకు చెందిన నాలుగు ఫైర్‌ ఇంజిన్లు.. దాదాపు ఎనిమిది గంటలపాటు మంటలను ఆర్పేందుకు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. వందల కోట్ల విలువైన మద్యం బాటిళ్లు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు సమాచారం అందించారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రభుదాస్ మాట్లాడుతూ.. ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పొగలు కమ్ముకొని ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణమే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినా.. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed