త్వరలో ఆస్పత్రి ప్రారంభం.. అంతలోనే అడ్డంగా కంచె వేశారు

by Shyam |
త్వరలో ఆస్పత్రి ప్రారంభం.. అంతలోనే అడ్డంగా కంచె వేశారు
X

దిశ, దుబ్బాక : కోట్లు వెచ్చించి నిరుపేదలకు వైద్యం అందించేందుకు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు. కానీ, ఆస్పత్రికి వెళ్లేందుకు దారి మాత్రం లేదు. ఆగస్టు 20న నూతన ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపనకు కూడా సిద్ధమవుతుంది. కానీ అంతలోనే ఆసుపత్రికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా కంచె నాటారు పట్టాదారులు. దీంతో ఆసుపత్రికి ఎలా వెళ్లాలి అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రభుత్వం కోట్లు వెచ్చించి నిరుపేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో.. వంద పడకల ఆసుపత్రి అప్పటి ఎమ్మెల్యే, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి హయాంలో మంజూరు చేసింది. ఆనాటి నుంచి మొదలైన పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా వంద పడకల ఆస్పత్రికి వెళ్లేందుకు రూ. కోటితో సీసీ రోడ్డు కోసం శంకుస్థాపన చేశారు.

మరి అధికారుల అలసత్వమో, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో తెలియదు కానీ.. ఆస్పత్రికి వెళ్లే దారి కోసం తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా సీసీరోడ్డు నిర్మిస్తున్నారని పట్టాదారులైన సాములేటి హనుమంతు, అర్జున్, పోశెట్టి అన్నదమ్ములు కలిసి రోడ్డుకు అడ్డంగా కంచె నాటారు. అక్రమంగా నిర్మించిన రోడ్డుకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో ప్రారంభోత్సవం ఉండగా.. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఇలా కంచే నాటి ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్లు అంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story