గ్రామసభలో నిలదీసిన ప్రజలు.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |   ( Updated:2021-06-29 06:20:57.0  )
sarpanch-komala
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి సర్పంచ్ లోకిని కోమల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రజారోగ్య గ్రామసభలో హరితహారం మొక్కలపై ప్రజలు నిలదీయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆమె పురుగుల మందు తాగారు. దీంతో కోమలను హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజారోగ్యంపై గ్రామసభ నిర్వహించారని అన్నారు. సభా ప్రాంగణంలో హరితహారంలో భాగంగా మొక్కలు పెట్టడానికి గుంతలు తవ్వినట్టు తెలిపారు. ఆ స్థలం ఆలయ ప్రాంగణం కావడంతో జాతర సమయంలో శ్రీ లక్ష్మి నంబులాద్రి స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. దీంతో, చెట్లు విరిగిపోతాయాని సర్పంచ్‌ను ఎంపీపీ, పలువురు గ్రామస్తులు నిలదీయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు పేర్కొన్నారు.

దీంతో, వెంటనే ఎంపీపీ బాలాజీ రావు కారులో కోమలను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే, సుల్తానాబాద్ మండలం కేంద్ర ప్రభుత్వ పథకమైన.. రూర్బన్ పథకానికి అర్హత సాధించడంతో, చాలా వరకు సర్పంచ్ సొంత డబ్బులతో పనులు పూర్తి చేశారని, వాటి బిల్లులు ఇప్పటివరకు రాలేదన్నారు. కోమల ఆత్మహత్యాయత్నానికి ఇది కూడా ఓ కారణమై ఉండవచ్చని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

Next Story