రైతుల ఆత్మహత్యలు అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలే: వైఎస్ షర్మిల

by Shyam |
రైతుల ఆత్మహత్యలు అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలే: వైఎస్ షర్మిల
X

దిశ, కౌడిపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన తో రైతుల యొక్క కష్టాలను కడతేర్చే బంగారు తెలంగాణలో రైతుల కలలు కన్నీళ్లు గా మిగిలి, చివరకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. రైతుల ఆత్మహత్యలు కావని ప్రభుత్వ హత్యలని వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం కౌడిపల్లి మండల పరిధిలోని కంచన్ పల్లి, లింగంపల్లి గ్రామాలలో రైతులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఓదార్చడం కోసం రైతు ఆవేదన యాత్రలో భాగంగా షర్మిల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా షర్మిల విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంట వరి సాగు చేస్తే ఊరి దిక్కు అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతుంటే ప్రభుత్వం విరుద్ధంగా వరి సాగు చేస్తే కొనుగోలు కేంద్రాలు నిర్వహించ బొమని టీఆర్ఎస్ చెప్పడం ఎంత వరకు సమంజసమని షర్మిల ప్రశ్నించారు. లక్ష కోట్లు అప్పుగా తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. రైతులు తమ తాతల నాటి నుంచి వరి సాగు చేసే వారిని వరి సాగు చేయ వద్దని కేసీఆర్ ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయమని రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం కేసీఆర్ ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం లక్షల కోట్లకు పడగలెత్తడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఉచిత కరెంటు తో పాటు ఒకే సమయంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ దేనని చెప్పుకొచ్చింది. అలాగే తన తండ్రి ఆశయ సాధన తో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రైతన్న రాజ్యం గా తయారు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర సాధన జరిగి నేటికి 7 సంవత్సరాలు గడిచినప్పటికీ కేసీఆర్ నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. అలాగే ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్లు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వం కారణం అయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతూ.. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని షర్మిల అన్నారు. తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రైతుల పాలిట అండగా ఉండి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. కంచన్ పల్లి గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల అయినా దుంపల మహేష్, శేఖర్ గౌడ్, గాండ్ల శ్రీకాంత్ కుటుంబీకులను ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే లింగంపల్లి గ్రామంలోని షేకులు రైతు కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం షర్మిల చేతులమీదుగా ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed