సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పొదెం

by Sridhar Babu |
సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పొదెం
X

దిశ, ఖ‌మ్మం : నాటిన ప్రతీ గింజ మొలకెత్తి సిరులు పండేలా సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తాలిపేరు మధ్యతరహా జలాశయానికి గల కుడి, ఎడమ కాలువల నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు చ‌త్తీస్‌గ‌ఢ్ దండకారణ్యంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు తాలిపేరు జలాశయం నిండుకుండలా మారిందన్నారు. వర్షాకాలం పంట కోసం అవసరమైన సాగునీటిని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి విడుదల చేశారు.

ప్రాజెక్ట్ నిర్వహణ బాలేదని రైతుల ఆందోళన..
ఏజెన్సీ వరప్రదాయని అయిన తాలిపేరు ప్రాజెక్టు నిర్వహణ సరిగాలేదని ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా లేవని, మరమ్మతులు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నానాటికీ తాలిపేరు జలాశయంలో పేరుకుపోతున్న సీల్ట్ తీయడానికి అధికారులు అలసత్వం వహించడంలో అర్థం ఏమిటనీ రైతులు విరుచుకుపడ్డారు. స్పందించిన పొదెం.. దశాబ్దాల కాలంగా ఏజెన్సీ ప్రాంతంలో రైతుల పంటలకు ఉపయుక్తంగా ఉండే తాలిపేరు ప్రాజెక్ట్ నిర్వహణకు నిధులు ఇవ్వలేని, చేతకాని దద్దమ్మ ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌కు చర్ల, దుమ్ముగూడెం మండలాలకు సాగు నీరందించే తాలిపేరు ప్రాజెక్టు‌పై నిర్లక్ష్యం వహించడంలోనే ఆయనకు రైతుల పై ఉన్న ప్రేమ కనిపిస్తోందన్నారు. తాలిపేరు మధ్యతరహా ఇరిగేషన్ కార్యాలయాన్ని సత్యనారాయణ పురంలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed