ట్రాన్స్ ఫార్మర్ ఇస్తారా.. కరెంట్ తీగలతో ఉరేసుకోమంటారా?

by Shyam |   ( Updated:2021-08-12 05:46:03.0  )
farmers
X

దిశ, కామారెడ్డి : కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా ‘నా దగ్గర ఏమైనా ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే మిషన్ ఉందా’ అని ఏఈ చులకనగా మాట్లాడుతున్నట్టు రామారెడ్డి మండల పరిధిలోని రాజమ్మతండా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సబ్‌స్టేషన్ ఎదుట తండా పరిధిలోని వ్యవసాయ భూముల రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తండా పరిధిలో 21 బోర్ మోటార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు 19 మోటర్ల నడిపించే సామర్థ్యం మాత్రమే ఉందని, దాంతో ఓవర్ లోడ్ అయి ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతుందని వెల్లడించారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు అయ్యిందని.. అందుకోసం 19 మంది కొత్తగా డీడీలు కూడా చెల్లించినట్టు రైతులు తెలిపారు.

అదనపు ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీలు కట్టినా.. కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఇవ్వలేదని విద్యుత్ అధికారులను వారు ప్రశ్నించారు. లైన్ మెన్‌ను అడిగితే ట్రాన్స్ ఫార్మర్ రాలేదని సమాధానం ఇవ్వగా.. ఆ తర్వాత ఏఈని అడిగితే ఏడీ వద్దకు, ఏడీని అడిగితే మళ్ళీ ఏఈ వద్దకు వెల్లుమంటూ రోజూ తిప్పుతున్నారని రైతులు వాపోయారు. అయితే, ‘నా దగ్గర ఏమైనా ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే మిషన్ ఉందా’..? పైగా కొత్తగా డీడీలు ఎందుకు కట్టారని ఏఈ తమతో చులకనగా మాట్లాడుతున్నారని చెప్పారు. డీడీలు కట్టించుకునే ముందు లైన్ మెన్‌కు తెలియదా అని రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారని రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ట్రాన్స్ ఫార్మర్ లేక పొలాలు ఎండిపోతున్నాయని, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసుకుంటున్న పంట ఎండిపోతే విద్యుత్ అధికారులదే బాధ్యత అని రైతులు స్పష్టం చేశారు. పొలాలు ఎండిపోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ తీసుకొచ్చి బిగించాలని, లేనియెడల విద్యుత్ వైర్లతో ఉరేసుకుని చస్తామని బాధిత రైతులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed