రైతుల ఆవేదన: ప్యాకేజీల‌తో ఉపాధి రాదు సార్‌.. భూమికి భూమివ్వండి

by Shyam |   ( Updated:2021-08-26 02:24:48.0  )
రైతుల ఆవేదన: ప్యాకేజీల‌తో ఉపాధి రాదు సార్‌.. భూమికి భూమివ్వండి
X

దిశ, చిట్యాల: మంచిర్యాల నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే కింద భూములు కోల్పోతున్న రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి మా జీవనాధారానికి ఆ భూములే సహాయపడుతున్నాయంటూ సర్వేలను భూనిర్వాసితులు అడ్డుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారికి అడుగడునా అడ్డంకులు ఎదురు అవుతున్నాయి. అయితే ఈ రహదారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, చిట్యాల మండలంలోని కాల్వపల్లి, గిద్దెముత్తరాం, వెలిశాల, టేకుమట్ల, రాఘవపూర్, రామకిష్టపూర్, అంకుశపూర్, నవాబుపేట, సోమన్ పల్లి, రాఘవపూర్, పంగిడిపల్లి గ్రామ శివారులను ఆనుకుని వెళుతుంది. దీనిపై అధికారులు భూముల కేటాయింపు సర్వే నిర్వహిస్తున్నారు.

కాగా టేకుమట్ల మండలంలోని గ్రామాల్లో సర్వే పూర్తి కాగా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో అధికారులు సర్వేను నిర్వహిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న నవాబుపేట రైతులు మంగళవారం సర్వేను అడ్డుకున్నారు. భూములకు బదులు భూములను కేటాయిస్తేనే సర్వే నిర్వహించాలని పట్టుబట్టడంతో అధికారులు వెనుతిరిగారు. నష్టపరిహారం తమకు వద్దని భూములకు బదులు భూములను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయే భూములకు ఏ మేరకు నష్టపరిహారం చెల్లిస్తారనే విషయం బహిర్గతం చేయకుండా సర్వే చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి ఆ భూముల్లో పంటను పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని భూములు కోల్పోతే కుటుంబ పోషణ ఎలా కొనసాగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూమికి బదులు భూముల నష్టపరిహారమా ?

జాతీయ రహదారి నిర్మాణల్లో వేలాది మంది రైతులు తమ వ్యవసాయ భూములు కోల్పోతున్నారు. అయితే సర్వే నిర్వహిస్తున్న అధికారులు భూములకు బదులు భూములు కేటాయిస్తారా? నష్టపరిహారం చెల్లిస్తారా? ఒకవేళ చెల్లిస్తే ఏ మేరకు అందిస్తారో అనే సందేహం వారిలో నెలకొంది. దీంతో రైతులు ఇటీవల నవాబుపేట గ్రామ శివారు భూములపై సర్వే నిర్వహిస్తున్న అధికారులను అడ్డుకున్నారు. కచ్చితంగా భూమికి బదులు భూమి కేటాయిస్తేనే భూములను వదులుకుంటామని అధికారులను హెచ్చరిస్తున్నారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు.

భూముల కేటాయింపుపై గ్రామసభలు..

జాతీయ రహదారి కింద భూములు కోల్పోతున్న రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి గ్రామంలో తప్పకుండా గ్రామ సభ నిర్వహిస్తామని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అయితే నేషనల్ యాక్ట్ ప్రకారం మాత్రమే భూ నిర్వాసితులకు చెల్లింపులు ఉంటాయంటున్నారు. నిర్ణయించిన రేటుకు ఒప్పుకోకుంటే ప్రభుత్వ రేటు ప్రకారం చెల్లింపులు ఉంటాయని, ప్రస్తుతం నేషనల్ హైవే లో భూములు కోల్పోయిన రైతులకు మరొక చోట భూముల కేటాయింపు ఉండదని నిక్కచ్చిగా చెబుతున్నారు. కానీ రైతుల అభ్యంతరాలను రాత పూర్వకంగా గ్రామ సభలో స్వీకరించి పరిష్కారం దిశ గా అడుగులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

111 ఎకరాలను కోల్పోతున్న రైతులు..

టేకుమట్ల మండలంలోని గ్రామాల్లో అధికారులు ఇటీవల నిర్వహించిన సర్వే పూర్తి అయింది. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతుల అభ్యంతరాలను స్వీకరించారు. మొత్తం నేషనల్ హైవే కింద 111 ఎకరాల వ్యవసాయ భూములను రైతులు కోల్పోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా చిట్యాల మండలంలోని గ్రామాల్లో ఇంకా సర్వే కొనసాగుతూనే ఉంది రైతుల నుంచి ఇబ్బందులు ఎదురు అవుతుండడంతో అధికారులు మరోసారి సర్వేకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆ భూములే మాకు జీవనోపాధి..

నాకు నవాబ్ పేట గ్రామ శివారు 463 మూడు లో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని నమ్ముకుని ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తూ కుటుంబ పోషణను కొనసాగిస్తున్నాను. ఇటీవలే మా భూమిలో నుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న అంటూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మాకు భూమికి బదులు భూమిని కేటాయిస్తేనే భూమిని వదులుకుంటాను. లేదంటే మెరుగైన నష్టపరిహారం అందించాలి. -రమేష్, నవాబుపేట,రైతు

నిబంధనల ప్రకారమే నష్ట పరిహారం..

నేషనల్ యాక్ట్ ప్రకారం మాత్రమే జాతీయ రహదారి కింద భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించడం జరుగుతోంది. ప్రస్తుతానికి జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎక్కడ భూమి బదులు భూమిని కేటాయించిన దాఖలాలు లేవు. భూముల కేటాయింపుపై తప్పనిసరిగా గ్రామంలో గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి అభ్యర్థనలను స్వీకరిస్తాం. తప్పకుండా రైతులకు న్యాయం జరిగేలా చూస్తం – చిట్యాల తహసిల్దార్ రామారావు.

Advertisement

Next Story

Most Viewed