జంతర్ మంతర్ వద్ద రైతుల నిరసనలు..

by Shamantha N |
జంతర్ మంతర్ వద్ద రైతుల నిరసనలు..
X

న్యూఢిల్లీ: అగ్రి చట్టాలు రద్దు చేయాలని ఎనిమిది నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతులు గురువారం జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న కాలంలో జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తామన్న రైతుల అభ్యర్థనకు ఢిల్లీ పోలీసులు షరతులతో ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా 200 మంది రైతులను సింఘు సరిహద్దు నుంచి బస్సులు, ఎస్‌యూవీల్లో ఎస్కార్ట్‌తో జంతర్ మంతర్‌కు తరలించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులు నిరసనలు చేశారు. పలువురు ఎంపీలు ఇక్కడికి వెళ్లినా స్టేజీ ఎక్కి ప్రసంగించలేదు. పార్లమెంటు సమావేశం జరుగుతున్న సమయంలో సమాంతరంగా వారూ కిసాన్ పార్లమెంటు నిర్వహించారు. తమ సమస్యలను యూకే పార్లమెంటు చర్చిస్తున్నదని, కానీ, మనదేశ పార్లమెంటులో మాత్రం చర్చించడం లేదని రైతు నేత యోగేంద్ర యాదవ్ అన్నారు.

తాము పార్లమెంటుకు మరింత చేరువయ్యామని, కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నామని రాకేశ్ తికాయత్ తెలిపారు. ఆగస్టు 13 వరకు ప్రతి రోజూ బ్యాచ్‌ల వారీగా ఇక్కడికి వచ్చి నిరసన చేస్తామని వివరించారు. ఈ ప్రభుత్వానికి నైతికత లేదని, తమ ఫోన్‌లపైనా కేంద్రం నిఘా వేసి ఉండొచ్చని రైతు నేత శివ కుమార్ కక్కా ఆరోపించారు. తమ డిమాండ్ల గురించి ఎంపీలందరికీ రాశామని, కానీ, చర్చే జరగడం లేదని మరో నేత హన్నా మొల్లా చెప్పారు. జాతీయ గీతం ఆలపించి నిరసనను విరమించిన రైతులు తిరిగి సింఘు సరిహద్దుకు ప్రయాణమయ్యారు. రైతులు నిరసనమార్గాన్ని వీడాలని, బిల్లులో ఏవైనా అభ్యంతరాలుంటే చర్చించడానికి సిద్ధమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed