రైతుల ప్లాన్ భలే ఉంది.. కరెంట్ రాలేదని ఏం చేశారంటే ?

by Shyam |   ( Updated:2021-12-24 02:59:49.0  )
రైతుల ప్లాన్ భలే ఉంది.. కరెంట్ రాలేదని ఏం చేశారంటే ?
X

దిశ, లింగాల : గ్రామంలో కరెంట్ సరిగా లేకపోవడంతో రైతులు విద్యుత్ అధికారులను బంధించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ రానందున, పొలంలో వేసిన వేరుశనగ ఎండిపోతుందని ఆగ్రహంతో లైన్ మెన్, లైన్ ఇన్స్ పెక్టర్‌లను గ్రామపంచాయతీ కార్యాలయం‌లో రైతులు తాళం వేసి నిర్బంధించిన ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలోని అంబట్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇది కాస్త ఉత్కంఠగా మారింది. గ్రామంలోని రైతులు, ప్రభుత్వ సూచనల మేరకు వరి పంటను కాకుండా వేరుశనగ పంటను వేశామని, గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలతో పంట పూర్తిగా ఎండిపోయిందని వాపోయారు. అనంతరం గ్రామంలోని రైతులు రోడ్డుపై ప్రధాన రహదారి పై కూర్చొని దాదాపు గంటసేపు ఆందోళన చేసి రాస్తారోకో చేపట్టారు. బంధించిన విద్యుత్ అధికారులను కరెంటు వచ్చి పొలంలో నీరు పారే వరకు వదిలిపెట్టేది లేదని బైఠాయించారు. ఈ బంధీలో విద్యుత్ అధికారులు లైన్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్, లైన్ మెన్ బాలస్వామి‌ని గ్రామ పంచాయతీ భవనం‌లోని ఒక గదిలో బంధించి తాళం వేయడం జరిగింది.

అనంతరం రైతు వెంకట స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచన మేరకు వరి వేయకుండా వేరుశనగ పంట వేశామని అయినా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. దీనికి ముఖ్య కారణం విద్యుత్ అధికారులని, అందుకే వారిని నిర్బంధించినట్లు తెలిపారు. ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి 9:00 కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల కరెంట్ పేరుతో ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి 24 గంటలు కరెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు తెలిపారు. నష్టపోయిన పంటకు పంట నష్టం అందించాలని కోరారు. ఇక నుంచి 24 గంటలు కరెంట్ రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రైతులు హెచ్చరించారు.

ఇట్టి విషయంపై విద్యుత్ అధికారి (AE) సుధాకర్ రావు‌ని స్థానిక దిశ రిపోర్టర్ ఫొన్ ద్వారా వివరాలు కోరగా.. అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలో గల వ్యవసాయ, విద్యుత్ వినియోగదారులకు అచ్చంపేట ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి 139,038 వి సబ్ స్టేషన్‌లో గల రెండు 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఒకొక్కదాన్ని 50 నుంచి 80 ఎంవీపీ‌గా అధిక లోడు పవర్ ట్రాన్స్ఫార్మర్ గా మార్చుటకు చర్యలు చేపడుతున్నామని, గతంలో ఇట్టి విషయాన్ని తెలిపామని అన్నారు. షిప్‌ల వారీగా వివిధ మండలాలకు కరెంట్ అందిస్తున్నామని అయినా రైతులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. రైతులు ఇప్పటికైనా సమస్యను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ అధికారులకు సహకరించాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed