కేసీఆర్ నన్ను మోసం చేసిండు: వరంగల్ వాసి

by Shyam |   ( Updated:2020-08-27 22:53:20.0  )
కేసీఆర్ నన్ను మోసం చేసిండు: వరంగల్ వాసి
X

దిశ, న్యూస్ బ్యూరో: ‘‘నాకు ఎకరంన్నర మెట్ట భూమి ఉంది. ఏటా మొక్కజొన్న సాగు చేస్తున్నా. ఈసారి అధికారులు వద్దని చెప్పారు. సర్కారు చెప్పిన పంటలే వేయమన్నరు. మా ఊరోళ్లు కూడా అదే మాట చెప్పిండ్రు. దీంతోనే ధైర్యం చేసి పత్తి వేసిన. ఇప్పుడు కురిసిన వానలకు పత్తి మొత్తం జాలు పట్టింది. ఇప్పటిదాకా ఎవ్వరూ నా భూమి దిక్కు రాలే. చెప్పిన పెద్ద సారే నాకు నష్ట పరిహారం కూడా ఇయ్యాలే’’ అని మహబూబాబాద్ జిల్లా కేంద్రం గాంధీపురం గ్రామానికి చెందిన రైతు బానోతు బిచ్యా ఆవేదన ఇది..

ఇలా చాలా ప్రాంతాల్లో రైతులు ఆందోళనలో మునిగారు. సీఎం కేసీఆర్ ఈ వానాకాలం నుంచి అమలు చేసిన నియంత్రిత సాగు విధానంలో చాలా మంది రైతులు చెప్పిన పంటలనే వేశారు. దీంతో పత్తి, వరి, కంది, పప్పు దినుసుల సాగు పెరిగింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. వర్షాలతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. కొన్ని పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో దాదాపు రైతులంతా పత్తి వైపే మొగ్గు చూపారు. ప్రభుత్వం మొక్కజొన్న సాగును వద్దనడంతో విధిలేని పరిస్థితుల్లో పత్తి సాగు చేశారు. పత్తితో పాటు ప్రభుత్వం చెప్పిన పంటలను వేశారు.

అంచనా తక్కువ.. నష్టం ఎక్కువ

ఇదే సమయంలో ప్రకృతి పగబట్టినట్లుగానే వర్షాలతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటల వివరాలను ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు. అయితే ఇంకా గ్రామాల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. దీనికి తోడుగా గ్రామాల నుంచి నివేదిక ఇవ్వాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఈసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మోయలేని పనిభారంతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల నష్టం సర్వే తమపైనే పెడుతున్నారని, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు చుట్టం చూపుగానే వ్యవహరిస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. దీంతో పంటల నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన సాగడం లేదు. ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారం 10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా పత్తి, వరి పంటలకే ప్రమాదం వాటిల్లింది. ఎక్కువగా పత్తి సాగుకే మొగ్గు చూపడం, పలు ప్రాంతాల్లో నీరు నిలిచి పత్తి మొత్తం దెబ్బతింది.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దీనికితోడుగా పెసర పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. పెసర రైతులకు ఈసారి భారీ నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు మళ్లీ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం లేదు. వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నప్పటికీ… గ్రామస్థాయిలో పరిశీలనకు పోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా గ్రామాలకు రాలేదని చెబుతున్నారు. రెండు లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి దెబ్బతిందని తెలుస్తోంది. కానీ ప్రాథమిక అంచనాల్లో మాత్రం 60 వేల లోపు చూపిస్తున్నారు. ఇలా చాలా పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అయినా సర్కారు నష్టం లెక్కల్లోకి మాత్రం ఇంకా చేరడం లేదు. అయితే పొలాల్లో నుంచి మొత్తం నీరు బయటకు వెళ్లిన తర్వాతనే పంట నష్టాన్ని అంచనా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

బీమా లేదు.. ధీమా లేదు

ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేశాయి. ప్రధాన మంత్రి పంటల బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను నిలిపివేశాయి. కేంద్రంపై భారమవుతుందని కేంద్రప్రభుత్వం.. వాటా చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వం బీమా చేయలేదు. అయితే జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్నిఈ సీజన్ నుంచి అమలు చేస్తోంది. కేవలం పత్తి, మిరప పంటలకు మాత్రమే ఈ బీమా ఉంటుంది. వాతావరణ ఆధారిత బీమా అంటే ఎంత దెబ్బతిన్నదనే వివరాలను పొలాలకు వెళ్లి చూడకుండానే పరిహారం ఇస్తారు. పంట వేసిన ప్రాంతాల్లో వర్షపాతం లెక్కలను వాతావరణ శాఖ నుంచి జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ తీసుకుంటుంది. గతేడాది, అంతకు ముందు ఏడాది సాధారణ వర్షపాతంతో పోల్చి, ఎక్కువ కురిస్తే అతివృష్టి, తక్కువ ఉంటే అనావృష్టిగా తీసుకుంటారు.

ఈ నేపథ్యంలో బీమా కంపెనీ వర్షపాతాన్ని లెక్కించేందుకు నిర్ణయించిన తేదీలు రైతులకు పరిహారాన్ని అందించేలా లేవు. నిబంధనల్లో పత్తి ఉన్న ప్రాంతంలో సాధారణం కన్నా వర్షం తక్కువగా కురిసే తేదీలను ఈ నెల 15 నుంచి నవంబరు 15గా నిర్ణయించుకున్నారు. మిరపకు అక్టోబరు 15 వరకూ గడువు పెట్టింది. సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడే తేదీలను పత్తికి సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు 31 దాకా, మిరపకు వచ్చే నెల 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, పలు జిల్లాల్లో సాధారణం కన్నా చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. పంటల బీమా లెక్కల ప్రకారం పంట వేసిన ప్రాంతంలో సాధారణం కన్నా 50 శాతం అదనంగా కురిస్తే బీమా పరిహారం ఎక్కువగా వస్తుంది. ఈ బీమా కంపెనీ ఆగస్టు 1 నుంచి కురిసే అధిక వర్షాలనే పరిగణనలోకి తీసుకుంటామనే మెలిక పెట్టడంతో వరదలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం వచ్చే అవకాశం లేదు. పంటలు వేసినప్పటి నుంచి కురిసిన వానలను పరిగణనలోకి తీసుకుంటే వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది. కానీ ఆగస్టు నుంచే లెక్కల్లోకి తీసుకుంటున్నారు.

ఆదుకుంటారా..?

రైతులు చెప్పిన పంటలనే సాగు చేశారు.. వ్యవసాయం పండుగలా మారింది.. అంటూ సీఎం కేసీఆర్ నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలంతా మొన్నటి దాకా ప్రకటనలు చేశారు. కానీ వర్షాలతో నష్టపోయిన అసలు సమయంలో ఒక్కరు కూడా కనిపించడం లేదు. కనీసం ప్రకటన కూడా లేదు. పత్తి, సన్నరకాలు, కంది పంటలు వేయాలంటూ చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు కష్టకాలంలో ముఖం చాటేశారు. దీంతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తారా? అనేది సందేహంగా మారింది. పంటల బీమా లేకపోవడంతో ఇప్పుడు ఆశలన్నీ సీఎంపైనే పెట్టుకున్నారు. నేడో, రేపో వరదలు, నష్టాలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తారని ప్రచారం జరుగుతున్నా నష్ట పరిహారంపై ఏదైనా ప్రకటన చేస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed