రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు : ప్రధాని మోడీ

by Anukaran |   ( Updated:2020-11-30 12:18:45.0  )
రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు : ప్రధాని మోడీ
X

లక్నో: సాగుచట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను విమర్శించారు. సర్కారు తీసుకువచ్చిన చట్టాలను గతంలో ప్రతిపక్షాలు నేరుగా వ్యతిరేకించేవని, కానీ నేడు ట్రెండ్ మారిందని అన్నారు. ప్రభుత్వ పథకాలపై అభూత కల్పనలు సృష్టించి, ప్రయోజనాలు కల్పించేవి అయినప్పటికీ తప్పుడు అభిప్రాయాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నూతన సాగుచట్టాలు అన్నదాతలను సాధికారులను చేస్తున్నాయని, పెద్ద మార్కెట్లను వారిచెంతకు తీసుకువచ్చే అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు. కొత్త చట్టాలు సరికొత్త అవకాశాలకు దారులు వేశాయని, చట్టబద్ధంగా వారికి రక్షణ కల్పించాయని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. కాశీ ఘాట్‌లలో పడవలో విహరిస్తూ సందర్శించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘాట్‌లలో 15 లక్షల దీపాలను వెలిగించారు. తొలి దీపాన్ని మోడీ వెలిగించారు. లేజర్ లైట్‌ల విన్యాసాలను పరిశీలించారు. ఘాట్‌ల సందర్శనకు ముందు వారణాసి పట్టణంలో 73 కిలోమీటర్ల వారణాసి-ప్రయాగ్‌రాజ్ జాతీయ హైవే ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశరాజధాని, దాని సరిహద్దులో రైతుల ఆందోళనలు ఉధృతంగా సాగుతుండగా, ఆ చట్టాలను మరోసారి సమర్థిస్తూ ప్రధాని మోడీ మాట్లాడారు. రవాణా సౌకర్యం పెరుగుతున్నప్పుడు రైతులకూ లబ్ది చేకూరుతుందని, సంస్కరణలన్నీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసినవేనని అన్నారు. ఎక్కువ ధర పొందే దగ్గర పంటను అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉండొద్దా? అని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరను తొలగించాలనుకుంటే మండీల అభివృద్ధిని ఎందుకు చేపడుతామని అడిగారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా కనీస మద్దతు ధరను అందించామన్నారు. తమ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం కాదని, నేరుగా లబ్దిదారులకు ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. గతంలో రుణమాఫీ ప్రకటనలు కుప్పలుగా వచ్చేవని, కానీ, రైతులకు ఆ ప్రయోజనాలు చేరేటివి కావని చెప్పారు. నేడు ప్రయోజనాలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాల ప్రకటనల్లాగే వీటిని భావించవద్దని అన్నారు.

హర్ హర్ మహాదేవ్..

హైవే ప్రాజెక్టు ప్రారంభోత్సవానంతరం ప్రధాని కాశీ ఘాట్‌ల సందర్శనకు వెళ్లారు. ప్రధానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్వాగతం పలికారు. దేశ అభివృద్ధి శిఖరాలను తాకుతున్న వేళ తాము ప్రధానిని కాశీకి ఆహ్వానిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యానాథ్‌లు ప్రధాని వెంటే ఉన్నారు. ‘హర్ హర్ మహాదేవ్’ అని జపిస్తూ ఘాట్‌లోని భక్తులను ప్రధాని పలకరించారు. గురునానక్ జయంతి సందర్భంగా ‘జో బోలేసో నిహాల్ సత్ శ్రీ అకాల్’ అంటూ నినదించారు. గురునానక్‌ను గుర్తుచేస్తూ సంస్కరణల గురించి మాట్లాడారు. సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు వ్యతిరేకత రావడం సహజమని, గురునానక్ కూడా ఈ వ్యతిరేకతను ఎదుర్కొన్నారని వివరించారు. దీర్ఘకాలంలో ఆయన బోధనలు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయని తెలిపారు. కొందరు ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తుంటారని వివరించారు. వారసత్వమంటే సంపద అని, కొందరికి మాత్రం కేవలం కుటుంబమేనని పరోక్షంగా ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్‌ను విమర్శించారు. వారణాసిలో గంగా ప్రయాణిస్తున్నట్టే కాశీలో అభివృద్ధి సాగుతుందని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మికంతోపాటు అభివృద్ధికి సిద్ధమవుతున్నదని తెలిపారు. క్రూజ్‌లో ప్రయాణిస్తూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన లేజర్ లైట్ల విన్యాసాలను తిలకించారు.

Advertisement

Next Story

Most Viewed