- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్న వడ్ల ప్యాకేజీ ఎత్తిపోయినట్లే..
దిశ, తెలంగాణ బ్యూరో: సన్న రకాల వరి సాగు చేస్తే మంచిగుంటుందని సీఎం చెప్పిండు. దొడ్డు రకాలను మొత్తం తగ్గించి సన్నాలను వేసినం. ఇప్పుడు అమ్ముకునే సమయంలో ధర పెంచుతామన్నరు. చెప్పి 24 రోజులైనా మారు ప్రకటన లేదు. అమ్ముకుందామంటే ఏదో ఆశ అడ్డుపడుతాంది. ఇప్పుడేమో అధికారులు, సొసైటీల నుంచి వచ్చి సన్న వడ్లు అమ్ముకోవాలని, ధర పెంచే అంశం తేలదని, పెంచినప్పుడు మీ ఖాతాల్లో జమ చేస్తామని కథలు చెప్పుతున్నరు… ఇన్ని రోజులు ఆగి ఆగి ఇప్పుడు పాత ధరకే అమ్ముకోవాల్నా.? పెట్టుబడికి తెచ్చిన మిత్తీలు కూడా నెల రోజులు ఎక్కువ మీద పడినట్లు అయ్యాయి. ఇప్పడు మాకు కూడా ఆ దుబ్బాక లెక్కన ఉప ఎన్నికలు వస్తే మంచిగుండు.. మా రైతు తడాఖా చూపిస్తము.. అంటూ రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సర్కారు మీద శాపనార్థాలు పెడుతున్నారు.
చేతులెత్తేసిన సర్కారు?
సీఎం కేసీఆర్ చెప్పిన నియంత్రిత సాగు విధానాన్ని వానాకాలంలో రైతులంతా పాటించారు. మొక్కజొన్న, దొడ్డు వడ్లు కాదని సన్నాలు సాగు చేశారు. 42 లక్షల ఎకరాల్లో ఈసారి సన్న రకాలు సాగయ్యాయి. కానీ, కొనుగోళ్ల సమయానికి సర్కారు చేతులెత్తేస్తోంది. వాస్తవంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. కానీ, గత నెల 31న సీఎం కేసీఆర్ రైతులకు లేని ఆశను కల్పించారు. మద్దతు ధర పెంచే అంశం ప్రభుత్వ పరిధిలో లేకున్నా సన్నాలకు రూ.100 నుంచి రూ. 150 వరకు పెంచుతామని ప్రకటించారు. దీంతో రైతులు సన్న ధాన్యం అమ్మకాలను నిలిపివేసుకున్నారు. కళ్లాల్లో, రోడ్లపై నిల్వ పెట్టుకున్నారు. ప్రకటనొచ్చి 24 రోజులు గడిచినా సన్న ధాన్యం మద్దతు ధర పెంపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. అధికారులు కూడా నిన్నటి వరకు ఏం సమాధానం చెప్పలేదు.
అమ్ముకోండంటూ.. వ్యవసాయ శాఖ ప్రచారం
తాజాగా గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ, సహకార సంఘాలు, కొనుగోలు కేంద్రాల తరఫున ప్రచారం చేపించారు. సన్న వడ్లు మొత్తం అమ్ముకోవాలని, ప్రస్తుతం ఉన్న ధరకు అమ్మాలని ప్రకటించారు. ధర పెంచే అంశంపై ఎలాంటి ఆదేశాలు లేవని, ఇక ముందు వస్తే పెంచిన మద్దతు ధరను రైతులకు వారి ఖాతాల్లో జమ చేస్తామని, ఇప్పుడైతే అమ్ముకోవాలని చెప్పుతున్నారు. అంటే ఇక మద్దతు ధర పెంపు ప్రక్రియ లేనట్లేనని స్పష్టమవుతోంది. ఇప్పుడున్న మద్దతు ధరను సరిగా ఇవ్వడం లేదని, ఎంతో కొంత పెంచుతామని స్వయంగా సీఎం ప్రకటించినా రూపాయి ఎక్కువ పెంచడం లేదని, ఈ సమయంలో పెంచినప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తామనడం నవ్వులాటగా ఉందంటూ రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
‘సన్నా’లపై రాజకీయ రణం
మరోవైపు సన్నాల కొనుగోళ్లపై రాజకీయంగా యుద్ధమే నడుస్తోంది. కేంద్రంపై రాష్ట్రం.. రాష్ట్రంపై కేంద్రం ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారు. అంతేగానీ రైతుల అంశంలో మాత్రం ఎలాంటి పట్టు చేయడం లేదు. గతేడాది చేసుకున్న ఒప్పందాన్ని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ బయటకు తీసుకొచ్చింది. ఒప్పందంలో మద్దతు ధరను పెంచుకునే అవకాశం రాష్ట్రానికి ఉంటుందని, ఆ భారం రాష్ట్రాలే భరించాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం..ఈ ఏడాది సెప్టెంబరు 17న కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన లేఖ సారాంశం ఇలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెస్పీ (ఏ- గ్రేడు రూ.1,888, సాధారణ రకం రూ.1,868) ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేయాలి. రాష్ట్రసర్కారు కానీ, కొనుగోలు ఏజెన్సీ కానీ రైతులకు బోన్‌స్ లేదా ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ఇచ్చే మొత్తాన్ని రాష్ట్రసర్కారే భరించాల్సి ఉంటుందనే నిబంధన ఉంది. వాస్తవానికి ఇది కొత్త నిబంధనేమీ కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెస్పీ కంటే అదనంగా రూ.50-200 వరకు బోనస్ ఇచ్చింది. ఆ భారాన్ని అప్పట్లో రాష్ట్రప్రభుత్వమే భరించింది. తాజా ఎంవోయూ ప్రకారం రాష్ట్రాలు కేటాయింపులకు మించి సేకరిస్తే సెంట్రల్ పూల్ కంటే అధికంగా పరిగణిస్తారు. సెంట్రల్ పూల్ కింద స్వీకరించే ధాన్యానికి మాత్రమే రాష్ట్రసర్కారు ఆర్‌బీఐ నుంచి రుణ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుందని ఎంవోయూలో స్పష్టం చేసింది.
రూ. 4 వేల కోట్లు సాధ్యమేనా…?
అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు సన్నాలపై ప్యాకేజీ ప్రకటిస్తుందా అనేది అనుమానంగా మారింది. బోనస్ ఇచ్చే అంశాన్ని ఇప్పటికీ తేల్చడం లేదు. రాష్ట్రంలో సన్నాలను 40 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. క్వింటాలుకు రూ.100 బోనస్ ప్రకటించినా ప్రభుత్వంపై రూ. 4 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. అదనంగా బోనస్ లేదా ప్రోత్సాహకాలు ఇవ్వదలిస్తే ఆ భారాన్ని రాష్ట్రమే మోయాల్సి ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
మిల్లర్ల మాయ..
ఈసారి సన్నాలు ఎక్కువ పండించడంతో మిల్లర్లు ధరను తగ్గిస్తున్నారు. గతంలో తక్కువ సాగు చేయడంతో మిల్లర్లు క్వింటాలుకు రూ. 2,500 వరకు కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుతం చాలా తక్కువకు కొంటున్నారు. పలు జిల్లాల్లో 17 శాతానికి మించి తేమ ఉందని, తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు రూ.1,700కే కొంటున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో రూ.1,868 ధర చెబుతున్నా తేమ 17 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, ధాన్యం రంగు మారినా, తాలు, చెత్త ఎక్కువగా ఉన్నా క్వింటాల్‌కు 3–4 కిలోల చొప్పున తీసేస్తున్నారు. ఈ లెక్కన ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 60 కిలోల మేర తరుగుపోతోంది. గతంలో ఎకరాకు 22–25 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, ఈ ఏడాది దోమకాటుతో 15 క్వింటాళ్లకు మించి దిగుబడి లేదు.
ఉప ఎన్నికలు వస్తే మంచిగుండు..!
ధాన్యం కొనుగోళ్లపై గ్రామాల్లో రైతుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబ్బాక లెక్కన మాకు కూడా ఉప ఎన్నికలు వస్తే రైతుల తడాఖా చూపిస్తామంటూ బహిరంగంగా చెప్పుతున్నారు. రైతులకు రైతుబంధు అవసరం లేదని, మద్దతు ధరపై ఇస్తే చాలంటున్నారు. రైతుల కోపాన్ని అర్థం చేసుకున్న ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు వెళ్లడం లేదు.