కలలు కల్లలుగా మిగిలిన వేళ.. జీవితం మీద విరక్తితో!

by Sumithra |
కలలు కల్లలుగా మిగిలిన వేళ.. జీవితం మీద విరక్తితో!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జీవితంలో రాణించాలని, తన పిల్లలను ప్రయోజకులను చేయాలని నానా కష్టాలు పడింది ఆ తల్లి. అనారోగ్యం, అప్పుల బాధలు ఎక్కువ కావడంతో జీవితం మీద విరక్తి చెంది ఇక జీవితాన్ని ముగించాలనుకుంది. తాను పోతే పిల్లలను ఎవరు చూసుకుంటారని ఆలోచించిందేమో, వారితో పాటే తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పరిధిలోని మన్యంకొండ దేవాలయ గుట్టలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కోడూరు గ్రామానికి చెందిన బాలకృష్ణమ్మకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. గతంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో తన ముగ్గురు కూతుర్లు, కుమారుడిని తీసుకొని తన తల్లిగారి గ్రామమైన దేవరకద్రకు వచ్చి బాలకృష్ణమ్మ అద్దె ఇంట్లో ఉంటూ పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తూ తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరు కూతుర్లకు వివాహాలు జరిపించింది. వచ్చే సంపాదన కుటుంబ పోషణకు, ఇంటి అద్దెకు సరి పోతుండటంతో డబ్బులు పొదుపు చేయలేకపోయారు. ఇటీవల పెళ్లీడుకొచ్చిన చిన్న కూతురుకు వివాహం చేయాలని ఆలోచిన చేసిన తల్లి, ఈ విషయాన్ని కుమారుడికి కూడా చెప్పింది.

దీంతో కుమారుడు పెయింటింగ్ తదితర పనులు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా నిలిచాడు. నెల రోజుల కిందట కుమారుడికి కరోనా సోకడంతో దాదాపు 50 వేల రూపాయలు అప్పు చేసింది. కుమారుడు రాజు పనులకు వెళ్లకపోవడం, తాము చేస్తున్న పండ్ల వ్యాపారం సక్రమంగా నడవకపోవడం, దీనికి తోడు లాక్‌డౌన్ రావడంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. ఈ దిగులుతోనే బాలకృష్ణమ్మ సైతం అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు జీవితంపైన పూర్తిగా విరక్తి చెందింది. సొంత ఇల్లు లేకపోవడం, పెద్దల సంపాదించిన ఆస్తులు లేకపోవడంతో అప్పులు తీర్చేదెలా, పిల్లల పెళ్లిళ్లు చేసేది ఎలా అని ఆలోచించి చివరగా ఆ తల్లి ఓ నిర్ణయానికి వచ్చింది. ఇద్దరు పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో గత సోమవారం తమ ఆరోగ్యం బాగా లేదు. మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిద్ర చేసి వస్తామని ఊర్లోనే ఉంటున్న పెద్ద కూతురుకి చెప్పి తన చిన్న కూతురు సంతోష, కుమారుడు రాజుతో కలిసి వెళ్ళింది.

ఉదయం ఆలయంలో దేవున్ని దర్శించుకుని దేవరకద్రకు వెళ్ళే దారిలో గల గుట్టల్లో తమ వెంట తెచ్చుకున్న గుళికల మందు తాగి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం బుధవారం సాయంత్రం వెలుగులోకి రావడం, మృతదేహాల వివరాలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో గ్రామస్తులు గుర్తించారు. ఈ మేరకు భూత్పూర్ సీఐ రజిత ఆధ్వర్యంలో దేవరకద్ర ఎస్ఐ భగవంతు రెడ్డి కేసు నమోదు చేసుకొని గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే వారికి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story